Breaking News

వ్యవస్థలను నాశనం చేస్తే సమాజం పురోగమించదు… : అజేయ కల్లం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
సమాజంలో ఉన్న వ్యవస్థలను నాశనం చేసుకుంటూ పోతే సమాజ పురోగమనం పతనమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు అజేయకల్లం పేర్కొన్నారు.ఈనెల 25వ తేది గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డాక్టర్ కొమ్మారెడ్డి రాజా
రామమోహన్ రావు శతజయంతి సందర్భంగా ఇండియా @ 75 అవకాశాలు – వాస్తవాలపై జరిగిన రాష్ట్ర స్థాయి సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సభకు జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా అజేయకల్లం ప్రసంగిస్తూ గతంలో రాజకీయ నేతలు గ్రామ సర్పంచ్ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగే వారని నేడు అనేకమంది ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా మంత్రులుగా,ముఖ్యమంత్రులుగా అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధనలపై అతి తక్కువగా వ్యయం చేయడం వలన ప్రపంచ పరిశోధనలో మన వాటా శూన్యంగా ఉందన్నారు.గత 75 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో సంక్షోభం కొనసాగటానికి రైతులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవటమేనని పేర్కొన్నారు. రైతులు పండించే పంటలను ప్రోత్సహించకుండా గత సంవత్సరం ఒక లక్ష పది హేడు వేల కోట్ల ఫామా అయిల్ ను దిగుమతి చేసుకున్నామన్నారు.ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ”కె. నాగేశ్వరర్ ప్రసంగిస్తూ భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం అయిన లౌకిక తత్వానికి, ఫెడరల్ దృక్పథానికి తిలోదకాలు ఇస్తూ విద్వేష భావజాలాని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వివిధ మతాలు,కులాలు,భాషలు, సాంప్రదాయాలు,వైరుధ్యాలు ఉన్న భారత సమాజంలో విద్వేష భావజాలాన్ని పెంపొందిస్తే భారతదేశం ఐక్యంగా ఉండలేదన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలపై సిబిఐ,ఈడి, ఇన్కమ్ టాక్స్ విభాగాలతో దాడులు చేయించడం మంచిది కాదన్నారు.విభిన్న భావాల మధ్య ఘర్షణ ఉన్నప్పుడే సమాజం పురోగమిస్తుందని తెలిపారు. సిపిఐ(యం)పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు ప్రసంగిస్తూ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ,సామాజిక న్యాయం,ఫెడరల్ వ్యవస్థ,లౌకిక వ్యవస్థలు కొనసాగుతూ ఉండటం వల్లనే భారతదేశం ఐక్యంగా ఉందన్నారు.నేడు భారతదేశ లౌకికవాదానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారతీయులందరూ ఐక్యంగా ఉండి వీటి రక్షణ కోసం పోరాడేసమయం ఆసన్నమైందన్నారు.డాక్టర్ కొమ్మారెడ్డి రాజా రామ్మోహన్ రావు ప్రజా వైద్యులుగా,గొప్ప మానవతావాదిగా విశేష కృషి జరిపారని,గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా,సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా, సింగరేణి కాలరీస్ వైద్య అధికారిగా,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉప కులపతిగా వాటి అభివృద్ధి కోసం విశేష కృషి జరిపినారని తెలిపారు. నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగిస్తూ గత 75 సంవత్సరాల కాలంలో విద్య,వైద్యం,వ్యవసాయ రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇంకా ఎంతో పురోగమించవలసిన అవసరం ఉందన్నారు.
శాసనమండలి చీఫ్ విప్ ప్రొ. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ వ్యవసాయ రంగంలో పురోగమించాలంటే ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ చేసిన సిఫార్సులను అమలు చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ నేత డా.మండలి బుద్ధ ప్రసాద్ ప్రసంగిస్తూ నిరంతరం చైతన్యం కలిగిస్తూ తన జీవితాన్ని కొమ్మారెడ్డి రాజా రామ మోహన్ రావు ప్రజల కోసం కృషి చేశారన్నారు.నేటి రాజకీయ నేతలు మనతో అంగీకరించని వారిపై కూడా సహనం వహించాలని కోరారు.వ్యతిరేకులకు సైతం భావ ప్రకటన,స్వేచ్ఛను అందించాలన్నారు. ప్రజాస్వామ్య పేరుతో ఎన్నికైన
వారిని ప్రశ్నించకుండా పొగుడుతూ ఉంటే వారు మరింత నియంతలుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బి.ఎస్ శివారెడ్డి ప్రసంగిస్తూ ఇండియాలో వైద్య,ఆరోగ్య రంగంలో పెనుమార్పులు సంభవించినప్పటికీని ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలతో పోల్చుకుంటే ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు.జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ రాజకీయాలను పవిత్రంగా చూడాలని,రాజకీయ నేతలు ప్రజలకు రోల్ మోడల్ గా,ఆదర్శంగా ఉండాలని బూతు పదాలతో, అసభ్య పదజాలాలతో నిరంతరం
విమర్శించే వాతావరణాన్ని సృష్టించరాదని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో అన్ని జిల్లా కేంద్రాలలో వివిధ రాజకీయ,సామాజిక,ఆర్థిక అంశాలపై చర్చా – గోస్ట్ లు నిర్వహించి ప్రజాస్వామ్య పరిపుష్టికీ కృషి చేస్తామన్నారు.డాక్టర్ కొమ్మారెడ్డి రాజా రామ్మోహన్ రావ్ మరియు కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి చిత్రపటాలకు ప్రముఖులందరు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ప్రముఖ చరిత్రకారులు వకుళాభరణం రామకృష్ణ రచించిన చారిత్రాత్మక రైతు రక్షణ యాత్ర పుస్తకాన్ని మరియు డాక్టర్ కొమ్మారెడ్డి రాజా రామ మోహన్ రావు జీవన చిత్రం పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రముఖ గజల్స్ గాయకులు మహమ్మద్ మియా,రాజేష్ బృందం పాడిన దేశభక్తి గీతాలు సభికులను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ,శాసనమండలి సభ్యులు కే.ఎస్ లక్ష్మణరావు, బొమ్మిడాలా శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ చైర్మన్ డా”బొమ్మిడాలా శ్రీకృష్ణమూర్తి,సహకార మార్కెటింగ్ సలహాదారులు బత్తుల బ్రహ్మానందరెడ్డి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి,నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్,దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *