పెడన, నేటి పత్రిక ప్రజావార్త:
మహిళలే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నారని గతంతో సరిపోలిస్తే, ఇప్పుడు అన్ని రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారని, బరువు బాధ్యతలు మోస్తూ ఏ రంగంలోనైనా నిర్ణయాత్మక పాత్ర వారే పోషిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కొనియాడారు.
సోమవారం ఉదయం ఆయన పెడన మండలం లోని బల్లిపర్రు, చెన్నూరు, చోడవరం, చేవేండ్ర, గుడివిందగుంట, కొంగనచర్ల, జింజేరు, అచ్చయ్యవారిపాలెం, కాకర్లమూడి, కమలాపురం, కుంకేపూడి, కోప్పల్లి, ముచ్చర్ల, మడక, నడుపూరు, కూడూరు, నందమూరి, నందిగామ, పెనుమిల్లి, సిరివర్తర్లపల్లి, నేలకొండపల్లి, పుల్లపాడు, ఉరివి, లంకలకలువగుంట గ్రామాలకు చెందిన 2121 మంది లబ్ధిదారులకు 3 కోట్ల 97 లక్షల 68 వేల 750 రూపాయలను పెడన వ్యవసాయ మార్కెట్ యార్డులో వైయస్సార్ చేయూత ఆర్ధిక సహాయం మూడో విడత పంపిణీచేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి జోగి రమేష్ వేలాదిమంది మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మిమ్మల్ని అందరిని చూస్తుంటే దేవీ నవరాత్రులలో కనకదుర్గమ్మ తల్లిని చూసినంత సంతోషంగా ఉందని అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. వేదాల నుంచి ఉద్భవించిన సనాతన ధర్మంలో మహిళకు పూజనీయ స్థానం ఉందని, స్త్రీని దేవతగా పూజించడం ఇక్కడ మాత్రమే ఉందన్నారు. మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. మహిళలు జ్ఞానాన్ని అలవరచుకుని స్త్రీ పురుష సమానత్వాన్ని చాటాలన్నారు. సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించగలరన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో పేద అక్కచెల్లెమ్మల కష్టాలను ఆయన ప్రత్యక్షంగా చూశారని, వారిని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధిలోనికి తీసుకురావాలని అభిలషించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఆయనేనని చెప్పారు. సాధికారిత దిశగా అడుగులు వేయాలని మహిళలకు కార్పొరేషన్, చైర్మన్ డైరెక్టర్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. మహిళలకు చేదోడువాదోడుగా ఉంటూ మహిళల సాధికారత కోసం వైయస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, అమ్మ ఒడి,తోడు వంటి అనేక పథకాలను జగన్ అమలు చేస్తున్నారన్నారు. కుటుంబంలో ఆర్థిక క్రమశిక్షణ మహిళలకే సాధ్యమని గుర్తించి ప్రతి పథకం వారి పేరిటనే ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం మహిళల రుణ మాఫీ చేస్తామని చెప్పి కూడా చేయలేదన్నారు. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి ఉన్న రుణ బకాయిలు నాలుగు విడతలుగా తిరిగి చెల్లిస్తామని చెప్పిన ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో తిరిగి జమ చేస్తున్నామన్నారు. అలాగే వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఎవరైతే మహిళలు క్రమశిక్షణగా సకాలంలో మూడు లక్షల రూపాయలు లోపు అప్పు తీసుకుని తిరిగి చెల్లించిన వారందరికీ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
ప్రతిరోజు సాయంత్రం అక్క చెల్లెమ్మలు ‘ గుప్పెడంత మనసు’ ‘ కార్తీకదీపం ‘ తదితర టీవీ సీరియళ్లకు తమ మొత్తం సమయాన్ని కేటాయించక, కొద్దిసేపు టీవీ చూడ్డానికి విరామం ఇచ్చి పిల్లలను ఒక గంటసేపు మీ వద్ద ఉంచుకొని శ్రద్ధగా చదివించాలని మంత్రి జోగి రమేష్ సూచించారు. డబ్బులు, బంగారం, పొలాలు, శాశ్వతం కాదని చిరస్థాయిగా నిలిచేది విద్య, విజ్ఞానం మాత్రమేనని ప్రతి ఒక్కరు ఈ సత్యం గ్రహించాలన్నారు. అలాగే, వారానికో పది రోజులకు ఒకసారి పాఠశాల లేదా కళాశాలకు వెళ్లి పిల్లల హాజరుశాతం, వచ్చిన మార్కులు, వారి నడవడిక తప్పక పర్యవేక్షించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పెడన ఎంపీపీ రాజులపాటి వాణి, పెడన వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గరికిపాటి చారుమతి రామానాయుడు, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు రాజులపాటి అచ్యుతరావు, వైస్ ఎంపీపీ పరసా వాకాలమ్మ, వ్యవసాయ సలహా సంఘం మండల అధ్యక్షుడు బొల్లా వెంకటేశ్వరరావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు డి. భైరవలింగం,పెడన వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి నాగబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోయ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి పామర్తి సాంబశివరావు, మతిన్ ఖాన్, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …