-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-30 వ డివిజన్ 249 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ విప్లవం నడుస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 30 వ డివిజన్ 249 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. విజయదుర్గా నగర్లోని రైల్వే వంతెన నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు పాదయాత్ర ప్రారంభించి.. 390 గడపలను సందర్శించారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు శాచ్యురేషన్ పద్ధతిలో అందజేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. ఏదైనా కారణాల వల్ల పథకాలు అందని అర్హులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సంక్షేమ పథకాల ద్వారా మూడేళ్లలో పొందిన లబ్ధికి కృతజ్ఞతగా పలువురు మహిళలు థ్యాంక్యూ సీఎం సార్ అంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి ఎమ్మెల్యే మల్లాది విష్ణు గ్రీవెన్స్ స్వీకరించారు. తమ దృష్టికి వచ్చిన ప్రతిఒక్క సమస్యను నూటికి నూరు శాతం పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అలాగే కనెక్టింగ్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
సచివాలయ పరిధిలో రూ. 3.48 కోట్ల సంక్షేమం
నవరత్నాల పథకాల ద్వారా 249వ వార్డు సచివాలయ పరిధిలో రూ. 3.48 కోట్ల సంక్షేమాన్ని మూడేళ్లలో అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 348 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 360 మందికి రూ. 50.40 లక్షలు., వైఎస్సార్ సున్నావడ్డీ ద్వారా 500 మందికి రూ.60.87 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 84 మందికి రూ. 16.49 లక్షలు., చేయూత ద్వారా 167 మందికి రూ. 31.31 లక్షలు., కాపు నేస్తం ద్వారా 25 మందికి రూ. 3.75 లక్షలు., వాహనమిత్ర ద్వారా 30 మందికి రూ. 3 లక్షలు., చేదోడు ద్వారా రూ. 10 వేల చొప్పున 59 మందికి రూ. 5.90 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలు వెగటుపుట్టిస్తున్నాయి
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత జుగుప్సాకరమైన రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి గారిపై టీడీపీ చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక కుటుంబ సభ్యులపై బురదచల్లే స్థాయికి పచ్చ నేతలు దిగజారారని మండిపడ్డారు. వైఎస్ భారతీ గారు రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి అని.. అటువంటి మహిళపై ఆరోపణలు చేయడం చంద్రబాబు నీచ రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు నారాలోకేష్ చేస్తున్న ఇటువంటి దిగజారుడు రాజకీయాల వల్లే పదేపదే ప్రజాక్షేత్రంలో అభాసుపాలవుతున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి గారిపై ఎవరైనా అవాకులు, చెవాకులు పేలితో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, డీఈ గురునాథం, నాయకులు డి.దుర్గారావు, సాసుపల్లి రామకృష్ణ, మార్తి చంద్రమౌళి, సామంతకూరి దుర్గారావు, ముత్యాలు, ప్రసాద్, మనోహర్, పవన్ రెడ్డి, పెద్దిరాజు, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.