ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
ముక్తా విద్రుడు హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః
యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మదారవింద యుగళం హసైర్వహంతీభజే||
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీగాయత్రీదేవి గా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రీమంత్రంతో అనుబంధంవుంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయ బడతాయి. గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీ మాతను దర్శించడంవలన సకల మంత్ర సిద్ధి తేజస్సు, జ్ఞానము పొందుతారు.