పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం

-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-30 వ డివిజన్ 249 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 30 వ డివిజన్ 249 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం సందడి వాతావరణంలో సాగింది. విజయదుర్గా నగర్లో ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా పర్యటించి.. 430 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా పథకాలు అమలవుతున్న తీరును నేరుగా ప్రజలను అడిగి ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలుసుకున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నగదు వేయడం ఎంతో సంతోషంగా ఉందని స్థానికులు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నవరత్నాల పథకాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. విద్యా, వైద్య, గృహ నిర్మాణ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వివరించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా నగదు బదిలీ చేయడం వల్ల అర్హత ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి ఎమ్మెల్యే మల్లాది విష్ణు గ్రీవెన్స్ స్వీకరించారు. చిట్టచివరి వీధులకు సైతం వెలుగులు ప్రకాశించేలా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లు అమర్చాలని వీఎంసీ సిబ్బందికి సూచించారు. అలాగే ప్రజలు విన్నవించిన ప్రతిఒక్క అభివృద్ధి పనిని పూర్తి చేసేందుకుగానూ.. ఒక్కో సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షల నిధులను ప్రత్యేకంగా కేటాయించినట్లు మల్లాది విష్ణు తెలిపారు.

పేదల జీవితాలకు ఆసరాగా ఆరోగ్యశ్రీ
ఆరోగ్యశ్రీ పథకంపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించేలా హెల్త్ సెక్రటరీలు, ఆరోగ్య మిత్రలు చొరవ చూపాలని మల్లాది విష్ణు సూచించారు. పర్యటనలో భాగంగా పలువురు వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ పేషంట్లు, హృద్రోగులను ఆయన పరామర్శించారు. పేదల ఆరోగ్యానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. గతంలో కేవలం 1,059 వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీలో చికిత్స జరిగేదని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,118 ప్రొసీజర్లకు ఉచితంగా వైద్యం అందుతున్నట్లు వెల్లడించారు. గ‌త ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో ఆరోగ్యశ్రీ నిధుల‌న్నీ చంద్రబాబు దుర్వినియోగం చేశార‌ని ఆరోపించారు. కానీ నేడు గ్రీన్ ఛానల్ ద్వారా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. రోగులు కూడా ఆరోగ్యశ్రీ ఆస్పత్రులపై అవగాహన కలిగి ఉండాలని.. ఆ దిశగా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల జాబితాను సచివాలయాలలోని నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని సిబ్బందికి సూచించారు. అత్యవసర సమయాలలోనూ రోగులు ఇబ్బందులకు గురికాకుండా చూడవలసిన బాధ్యత ఆరోగ్య మిత్రలు తీసుకోవాలన్నారు. మరోవైపు ఈ ప్రాంతానికి కూతవేటు దూరంలోని అయోధ్యనగర్ లో ఇటీవల ప్రారంభించుకున్న వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

సీఎం వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌కు అవార్డులే నిద‌ర్శనం
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనడానికి రాష్ట్రానికి వస్తున్న అవార్డులే నిదర్శనమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) విజయవాడ డివిజన్ కు బెస్ట్ ఆర్గనైజర్ కోవిద్ సెంటర్స్ అవార్డు లభించడం సంతోషదాయకమన్నారు. యువ ముఖ్యమంత్రి పనితీరుకు ఈ అవార్డులు అద్దం పడుతున్నాయన్నారు. కేంద్రం, వివిధ సంస్థల నుంచి అవార్డులు అందుకుంటున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలోనే ముందంజలో ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్కోచ్ సహా పలు విభాగాలలో రాష్ట్రానికి వచ్చిన అవార్డులే ఇందుకు నిదర్శనమన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ టీడీపీ, బీజేపీ, జనసేన విమర్శిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న మంచిపేరును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలోనూ, బయట తెలుగుదేశం ఘోరంగా విఫలమైందని మల్లాది విష్ణు విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమాలు, పథకాలతో పేదల జీవితాలలో గుణాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. 2014-19 మధ్య ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి.. 2019 తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న విప్లవాత్మకమైన మార్పులు ఏవిధంగా ఉన్నాయో అసెంబ్లీలో ముఖ్యమంత్రి వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధాటిని తట్టుకుని నిలబడే శక్తి.. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదని, భవిష్యత్తులో రాదని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ పర్యటనలో భాగంగా ప్రజల నుంచి లభించిన ఘన స్వాగతానికి, చూపిన ఆదరాభిమానాలకు ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, డీఈ గురునాథం, నాయకులు డి.దుర్గారావు, సాసుపల్లి రామకృష్ణ, మార్తి చంద్రమౌళి, సామంతకూరి దుర్గారావు, ముద్రబోయిన దుర్గారావు, ముత్యాలు, ప్రసాద్, మనోహర్, పవన్ రెడ్డి, పెద్దిరాజు, భోగాది మురళి, మణికంఠ, రమేష్, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *