– ఓబులమ్మ గ్రామానికి ఆర్గానిక్ సర్టిఫికేట్ వరం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆర్గానిక్ సర్టిఫికేట్ కలిగి నాణ్యమైన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ జైవిక్ ఇండియా అవార్డుసొంతం చేసుకొన్న YSR కడప జిల్లాకు చెందిన బండి ఓబులమ్మను బుధవారం రైతు సాధికార సంస్థ కార్యాలయంలో జర్మన్ కు చెందిన KFW డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధి ఐరిష్ మరియు RySSఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ విజయకుమార్ శాలువా కప్పి సన్మానించారు. పది ఎకరాల విస్తీర్ణంలో రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను పండిస్తూ తన కుటుంబం తో పాటు సమాజానికి నాణ్యమైన ఆరోగ్యవంతమైన వ్యవసాయ ఫలాలను అందిస్తున్నందుకు బండి ఓబులమ్మను అభినందించారు. ఈ సంధర్భంగా ఐరిష్ మాట్లాడుతూ ఉన్నత చదువులు లేకపోయినా ఓబులమ్మ వ్యవసాయం ద్వారానే సమాజానికి తనవంతు సహాయం చేస్తుందని కొనియాడారు. ఎంతకాలంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, ఎవరెవరు పొలం పనుల్లో భాగం పంచుకొంటున్నారు, ఎంత ఆర్థిక లాభం వస్తుంది, ఏయే పంటలు పండిస్తున్నారు,మార్కెటింగ్ విధానం తదితర వివరాలను అడిగి తెలుసుకొన్నారు.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రైతు సాధికార సంస్థ ప్రోత్సాహంతో ఓబులమ్మకు ఈ అవార్డు దక్కడం వల్ల తనకు కూడా అందులో భాగస్వామ్యం ఉందని, ఆ విషయం తనకు ఎంతో ఆనందంగా వుందని సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. మార్కెటింగ్ పై ఐరిష్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఓబులమ్మ తాను తన కుటుంబ సభ్యుల సహకారంతో వాట్సప్ గ్రూప్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నానని, ఆ గ్రూప్ లోని 300 మంది సభ్యుల్లో ఎక్కువ మంది డాక్టర్లే వున్నారని చెప్పారు.
ఈ సంధర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ బండి ఓబులమ్మ అవార్డు సొంతం చేసుకొన్నందుకు కానుకగా ఓబులమ్మ స్వగ్రామమైన టి. కొత్తపల్లి (మైదుకూరు మండలం, YSR కడప జిల్లా ) గ్రామంలో రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతులందరికి ఆర్గానిక్ సర్టిఫికేట్ ప్రధానం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం TTD కి 12 రకాల వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేస్తున్న రైతులకు మాత్రమే ఆర్గానిక్ సర్టిఫికట్స్ అందజేస్తున్నామని, ఓబులమ్మ కారణంగా ఆ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరికి ఆర్గానిక్ సర్టిఫికట్స్ ఇస్తామన్నారు. ఆ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పేర్లను మాకు తెలియచేయండి అన్నారు. ఈ సంధర్భంగా ThematicLeadsశ్రీ ప్రభాకర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన అవార్డ్స్ లో రైతు సాధికార సంస్థ నాలుగింటిని సాధించడము వల్ల ఆగ్రాలో జరిగిన అవార్డు ప్రధాన కార్యక్రమంలోసంస్థకు మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు . ఈ సన్మాన కార్యక్రమంలో RySS చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామారావు, KFW డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధి శరవనన్, RySSస్టేట్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ కే. ప్రభాకర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్లు మురళీధర్, వరప్రసాద్ , ఉమామహేశ్వరి, ఇతర ThematicLeadsశ్రీకాంత్, జాకీర్, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ నివేదిత తదితర సిబ్బంది పాల్గొని ఓబులమ్మకు అభినందనలు తెలియజేశారు. ఈ నేల 23 వ తేదీన ఆగ్రా లో జరిగిన కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ 4 పాన్ ఇండియా అవార్డ్స్ అందుకొన్న విషయం తెలిసిందే.