Breaking News

అత్యంత పారదర్శకంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల పరీక్షలను నిర్వహించాం

-ఎలాంటి అవక తవకలకు ఆస్కారం లేదు
-రాత పరీక్షల్లో మార్కులను ఇప్పటికే వెబ్‌సైట్లలో ఉంచాం
-అర్హత, యోగ్యతలకే ప్రాధాన్యత ఇచ్చేలా నియామక ప్రక్రియ
-పరీక్ష నిర్వహణలో అధికారులుగా మాకు ముఖ్యమంత్రి ఎంతో స్వేచ్ఛను ఇచ్చారు
-హైకోర్టు కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాలను నిలుపుదల చేశాం
-న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నాం
-వీరి సూచనలతో అవసరమైతే మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తాం
-రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఆర్‌. అనూరాధ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు అంగన్‌ వాడీ సూపర్‌ వైజర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని, ఈ పరీక్షల నిర్వహణ విషయంలో వారు మాకు పూర్తి స్వేచ్చను ఇచ్చారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిఫల్‌ సెక్రటరీ ఏ.ఆర్‌.అనురాధ తెలిపారు. పోస్టుల భర్తీ విషయంలో ఎటు వంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అభ్యర్థుల అర్హత, యోగ్యతలకే ప్రాధాన్యత ఇచ్చేలా నియామక ప్రక్రియను రూపొందించామన్నారు. ఈ పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం మద్యంతర ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో ఫలితాల ప్రకటను నిలుపుదల చేశామని, న్యాయ నిపుణుల సలహా మేరకు అవసరమైతే తిరిగి ఈ పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆమె తెలిపారు.

శుక్రవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్‌ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె పాల్గొని ఈ పరీక్షల ప్రక్రియలో ప్రభుత్వం అనుసరించిన పారదర్శక విధానాన్ని వివరించారు. రాష్ట్రంలో 55,607 అంగన్‌ వాడీలు ఉన్నాయని, 25 అంగన్‌ వాడీ కేంద్రాలకు ఒక సూపర్‌ వైజర్‌ ఉండాల్సి ఉండగా, ఎక్కువ సూపర్‌ వైజర్‌ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల, ఒక్కొక్క సూపర్‌ వైజర్‌ 60 అంగన్‌ వాడీ కేంద్రాల వరకూ పర్యవేక్షించడం జరుగుచున్నదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగానున్న 560 అంగన్‌ వాడీ సూపర్‌ వైజర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేన్‌ జారీచేసి భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21,098 అంగన్‌ వాడీ వర్కర్లు, 82 కాంట్రాక్టు సూపర్‌ వైజర్లు ఈ పరీక్షకు హాజరయ్యారన్నారు.

రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా అంగన్‌ వాడీల్లో పి.పి.–1 మరియు పి.పి.–2 విధానం అమలు పర్చడం వల్ల పిల్లలకు ఇంగ్లీషును నేర్పించడం జరుగుచున్నదన్నారు. అందుకు తగ్గట్టుగా అంగన్‌ వాడీ పిల్లలకు ఇంగ్లీషు రైమ్స్, పధాలు , సెంటెన్సులు చెప్పాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల స్పోకెన్‌ ఇంగ్లీషు నైపుణ్యతను పెంచేందుకు వ్రాత పరీక్షతతో పాటు వారికి స్పోకెన్‌ ఇంగ్లీషు పరీక్ష కూడా నిర్వహించేదుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అభ్యర్థుల ఇంగ్లీషు నైపుణ్యాన్ని పరీక్షించేందుకు ఇంటర్యూలు నిర్వహిస్తే అభ్యర్థులకు చాలా కష్టంగా ఉంటుందనే అలోచనతో 3–5 నిమిషాలు వీడియోను రికార్డు చేసుకొని అప్‌ లోడ్‌ చేయాల్సినదిగా నోటిఫికేషన్లో పొందుపర్చడం జరిగిందన్నారు. 45 మార్కులతో కూడిన మల్టిపుల్‌ ఛాయిస్‌ వ్రాతపరీక్ష తెలుగులో నిర్వహించడం జరిగిందని, మరో ఐదు మార్కులు స్పోకెన్‌ ఇంగ్లీషు నైపుణ్యానికి కేటాయించడం జరిగిందన్నారు. ఓ.ఎం.ఆర్‌. షీట్‌ లో గుర్తించబడిన సమాధానాలను కంప్యూటర్‌ స్కానర్‌ ద్వారా మార్కులను ఖరారు చేయడం జరిగిందన్నారు.

స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు ఒంగోలు, ఏలూరు, విశాఖపట్నం మరియు కర్నూలు జిల్లాలలో నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని, ఆయా జిల్లాల కలెక్టర్ల అద్యక్షతన నాలుగు జిల్లా ఎంపిక కమిటీలను (డి.ఎస్‌.సి.) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ నాలుగు జిల్లాలోని కలెక్టర్లకు వ్రాత పరీక్షల్లో మంచి మార్కుల సాదించిన అభ్యర్థుల మెరిట్‌ లిస్టును పంపించి సి.డి.పి.ఓ.ల ద్వారా స్పోకెన్‌ ఇంగ్లీషు వీడియోలను తెప్పించి మూల్యాంకనం చేయడం జరిగిందన్నారు. ఈ స్పోకెన్‌ ఇంగ్లీషు మీడియోలకు గరిష్టంగా ఐదు మార్కులను వేయడం జరిగిందన్నారు.

అంగన్‌ వాడీ సూపర్‌ వైజర్‌ పోస్టులు జోనల్‌ స్థాయి పోస్టులని, వాటి భర్తీలో రూల్‌ ఆప్‌ రిజర్వేషన్‌ ను అనుసరించడం జరిగిందన్నారు. వ్రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను రోస్టర్‌ పాయింట్‌ ప్రకారం అంటే ఎస్‌.సి., ఎస్‌.టి., బి.సి., వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలతో పాటు ఓ.సి. అభ్యర్థులను కూడా ఒక్కొక్క పోస్టుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున 1:2 విధానంలో అభ్యర్థుల మెరిట్‌ లిస్టులను రూపొందించి మొత్తం 1,194 అభ్యర్థులను స్పోకెన్‌ ఇంగ్లీషు వీడియోలకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ అంతా ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు. అయితే ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో చూపకుండా ఆ జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపించడం జరిగిందన్నారు. యు.పి.పి.ఎస్‌., ఏ.పి.పి.ఎస్‌. లాంటి పోటీ పరీక్షల్లో వ్రాత పరీక్ష, ఇంటర్యూ ఉన్నప్పుడు ముందుగా వ్రాత పరీక్ష మార్కులను వెల్లడించడం జరుగదని, ఆ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్యూకి పిలవడం జరుగుతుందని, ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిన తదుపరి మాత్రమే వ్రాత పరీక్ష, ఇంటర్యూ మార్కులను వెల్లడించడం జరుగుతుందన్నారు. అదే విధానాన్ని మేము అనుసరించడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు.

అయితే ప్రభుత్వం అనుసరించిన ఈ ప్రక్రియపై కొందరు అభ్యర్థులు పలు సందేహాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందన్నారు. స్పోకెన్‌ ఇంగ్లీషు ప్రక్రియ ప్రారంభించక ముందే వ్రాత పరీక్ష కీ ఎందుకు వెల్లడి చేయలేదని, మార్కులు ఎందుకు ప్రకటించలేదు అనేవి ముఖ్యంగా వారి సందేహాలు అన్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం మద్యంతర ఉత్తర్వులను నేడు జారీ చేసిన నేపథ్యంలో పరీక్షా ఫలితాల ప్రకటనను నిలుపుదల చేయడం జరిగిందన్నారు. అయితే వ్రాత పరీక్ష మార్కులను ఇప్పటికే వెబ్‌ సైట్‌ లో ఉంచడం జరిగిందన్నారు. ఈ పరీక్షల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చారని, ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహాలను తీసుకుని ముందుకు వెళతామని ఆమె స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాదానం చెపుతూ 2013 లో జరిగిన పోస్టుల భర్తీపై ఇంకా ఆరు కేసులు హైకోర్టులో ఉన్నాయన్నారు. ఈ 560 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చిన తదుపరి 164 పోస్టులను ప్రక్కన పెట్టమని హైకోర్టు నుండి స్టే ఆర్డరు వచ్చిందని ఆమె తెలిపారు. ప్రస్తుత నోటిఫికేషన్‌ చాలా కాలం తదుపరి జారీచేసినందున వయోపరిమితిని 45 నుండి 50 ఏళ్లకు పెంచినట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డా.ఎ.శిరి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *