ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జలవనరుల శాఖకు చెందిన ఖాళీ స్థలాన్ని తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అనుమతి తీసుకోవడం జరిగిందని డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను, ఏర్పాట్లను శనివారం రాష్ట్ర డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ఆరో రోజుకు చేరుకున్నాయన్నారు. ఉత్సవాలలో భక్తులందరూ అమ్మవారని భక్తిపార్వశంతో దర్శించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. క్యూలైలలో ఉన్న భక్తులను ఎవరిని అడిగినా ఏర్పాట్లు బాగున్నాయంటూ భక్తులందరి నోటివెంట అదే మాట వినవస్తున్నదని మంత్రి అన్నారు. ఏవైన చిన్నచిన్నలోపాలు ఉన్న అవి సరిదిద్దుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నామన్నారు. శుక్రవారం సుమారు 80 వేల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారన్నారు. అమ్మవారికి నివేదన, వర్షం వచ్చినప్పుడు కొంత సమయం ఆలస్యమైన పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రసాదాలు, ఇతర లడ్డూ ప్రసాదాలుగాని సిద్దం చేసుకుని ఉంచామన్నారు. సీతమ్మ వారి పాదాల వద్ద పార్కింగ్, కేశఖండన స్నానాల నిమిత్తం క్లోక్ రూమ్ తాత్కాలిక ఏర్పాటు నిమిత్తం శనీశ్వరాలయ సమీపంలో జల వనరుల శాఖకు చెందిన నాల్గున్నర ఎకరాల స్థలాన్ని పార్కింగ్ తదితర అవసరాలకు తాత్కాలికంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకునన్నామన్నారు. సీతమ్మవారి పాదాల సమీపంలో ఉన్న 4.5 ఎకరాల్లో ఉన్న స్థలంలో 20 మీటర్లు రోడ్డుకు వదిలివేయగా 3.75 సెంట్లు స్థలాన్ని జలవనరులశాఖ మంత్రివర్యులతో మాట్లాడి తాత్కాలికంగా వినియోగించుకునేలా అంగీకరించిన మంత్రి అంబటి రాంబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. 40 నిమిషాలలోనే అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్రం నలుమూల నుండి వస్తున్న భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. భక్తులకు తృప్తికరమైన దర్శనం లభించిందనే సంతృప్తి తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని మంత్రి అన్నారు. భక్తులకు చేసిన ఏర్పాట్లలో లోపాలను గుర్తిస్తే వాటిని సరిదిద్దుతామని, తగిన సూచనలు సలహాలను స్వాగతిస్తున్నామన్నారు. ఆదివారం మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆ సమయంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సూచనలు పాటించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఆ సమయంలో భక్తులకు ఆసౌకర్యం కలుగకుండా డిస్ ప్లే స్క్రీన్ ద్వారా అమ్మవారి పూజలు, హారతులు, గ్రామోత్సవాలను ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు త్రాగునీరు, బటర్ మిల్క్, పాలు సరఫరా చేస్తున్నామని అన్నారు. ఈదైవ కార్యక్రమంలో ఎక్కడైనా లోపాలు జరిగినా మానవతప్పిదంగా చూడకుండా సరిచేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు. అందుకు మీడియావారి సూచనలు పాటిస్తామన్నారు. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపైనా ఉండాలని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
Tags indrakiladri
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …