-సజ్జల, చిల్లపల్లి, ఎంఎం నాయక్ లకు కృతజ్ణతలు తెలిపిన ప్రతినిధులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న చేనేత బకాయిల విడుదల పట్ల చేనేత సహకార సంఘాల బాధ్యులు సంతోషం వ్యక్తం చేసారు. పూర్వపు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుండి బుధవారం విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంకు వచ్చిన నేతన్నలు సంస్ధ ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు, చేనేత, జౌళి శాఖ కమీషనర్, ఆప్కో ఎండి ఎంఎం నాయక్ కలిసి తమ అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ కాలం నుండి పేరుకు పోయిన బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్ధాయిలో విడుదల చేస్తుండగా చివరి విడతగా ఇటీవల రూ.70 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసారని ఈ సందర్భంగా చిల్లపల్లి తెలిపారు. చేనేత కార్మికులకు ప్రభుత్వ పరంగా రావలసిన అన్ని రకాల నిధులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమేరకు సిఎం హామీ ఇచ్చారని వివరించారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన నేత కార్మికుల ప్రతినిధులు పలు అంశాల గురించి ఛైర్మన్, ఎండిలకు వివరిస్తూ పండుగల సమయంలో ఇచ్చిన ప్రత్యేక రాయితీ , త్రిఫ్ట్ ఫండ్, నూలు రాయితీ, పావలా వడ్డీలకు సంబంధించి సైతం బకాయిలు ఉన్నాయని వాటిని కూడా విడుదల చేయించి నేత కార్మికుల జీవన ప్రమాణ స్ధాయి పెరిగేందుకు సహకరించాలని విన్నవించారు. ఈ సందర్భంలో కమీషనర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ ఇప్పటికే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని , నిధుల మంజూరుకు సానుకూలంగానే ఉన్నారని తెలిపారు. అనంతరం ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నేతృత్వంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసిన చేనేత సంఘాల ప్రతినిధులు చేనేతల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నుండి లభిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయం తరువాత అత్యధిక మంది అధార పడిన చేనేత రంగాన్ని స్వావలంబన దిశగా తీసుకువెళ్లటమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని ఈ సందర్భంగా సజ్జల పేర్కొన్నారు.