-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం ద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో హిందూ ప్రచార పరిషత్ సభ్యులు బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. గీతా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 27న పున్నమితోటలోని టీటీడీ కళ్యాణ మండపం నందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా ఆహ్వానించారు. గుడికో గోమాత సహా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దఎత్తున ముందుకు తీసుకెళ్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు ప్రశంసించారు. అలాగే బాల్య దిశలోనే చిన్నారులలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, భక్తి భావాన్ని పెంపొందించేలా.. 6,7,8,9 తరగతుల విద్యార్థులకు ఏటా భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్ధి దశ నుండి భగవద్గీతను పఠించడం ద్వారా ఇంద్రియాలను అదుపు చేసుకుని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. భారతీయ సనాతన ధర్మం తాత్విక, జ్ఞానసారం భగవద్గీత అని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అనంతరం మల్లాది విష్ణు చేతుల మీదుగా బ్రోచర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ బాలిగోవింద్, ధర్మ ప్రచార పరిషత్ జిల్లా ప్రోగ్రాం ఇంఛార్జి సి.వి.కె.ప్రసాద్, ధర్మ ప్రచార మండలి సభ్యులు బొగ్గరపు వెంకట బాలకోటేశ్వరరావు, విశ్వధర్మ పరిషత్ సభ్యులు ఉప్పులూరు శేష ప్రసాదశర్మ, నాయకులు నాడార్స్ శ్రీను, ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.