-ప్రతి కార్డుదారునికి గడప వద్దకే రేషన్…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పారదర్శకంగా సకాలంలో నాణ్యమైన రేషన్ బియ్యాన్ని మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ చేయడం పట్ల కార్డుదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు నగరంలోని పకీరుగూడెం 242 రేషన్ దుకాణం, కెఆర్ 84062 నెంబర్‌గల మొబైల్ వాహనం ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ విధానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ విధానన్ని ప్రతి నెల తప్పనిసరిగా తనిఖీలు చేసి పారదర్శకంగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఇకపై రేషన్ దుకాణాలు, మొబైల్ వాహనాలను సంబంధిత అధికారులు తనిఖీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 5 లక్షల 86 వేల 645 రేషన్ కార్డులు ఉన్నాయని వీటిలో 5 లక్షల 63 వేల 582 తెల్లరేషన్ కార్డులు కాగా 23,063 అంత్యోదయ రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. కార్డుదారులకు 958 రేషన్ దుకాణాలు 374 మొబైల్ వాహనాలు ద్వారా 8,375 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాణ్యమైన రేషన్ బియ్యాన్ని ప్రతి నెల మొదటి వారంలో కార్డు దారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. మొదటి వారంలోనే దాదాపు 70 నుండి 80 శాతం మంది కార్డుదారులు రేషన్ దుకాణాలు మొబైల్ వాహనాల ద్వారా బియ్యాన్ని పొందుతున్నారన్నారు. పకీరుగూడెంలోని 242 రేషన్ దుకాణంలో రేషన్ బియ్యాన్ని పొందుతున్న కార్డుదారులను విచారించగా వారు పంపిణీ పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. 242 రేషన్ దుకాణం పరిధిలో 552 కార్డుదారులు ఉండగా ఇప్పటికే 447 మంది రేషన్ తీసుకోవడం జరిగిందని మరో 25 అంత్యోదయ కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. మొబైల్ వాహనం ద్వారా సకాలంలో కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తూ కార్డుదారుల ప్రశంసలు అందుకుంటున్న ఎస్. సాయి శివప్రసాద్‌ను కలెక్టర్ డిల్లీరావు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం నాణ్యత ఎంతో బాగుందని గడపవద్దకే వచ్చి బియ్యాన్ని పంపిణీ చేయడం వలన పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని దీనివలన సమయం ఆదా అవుతుందని ఇళ్ళలో పనిచేసుకుంటున్న కె. లక్ష్మి ఆనందం వ్యక్తం చేసింది. రేషన్ బియ్యం తీసుకున్న కర్రి జ్వోతి మట్లాడుతూ తన భర్త అపార్టమెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నామని నలుగురు కుటుంబసభ్యులమైన మాకు 20 కేజిల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని నాణ్యమైన బియ్యాన్ని కెజి 1రూపాయకే ఎలక్ట్రానిక్ మిషన్ పై తూకం వేసి ఇస్తున్నారని ఆమె జిల్లా కలెక్టర్‌కు వివరించింది.
రేషన్ దుకాణం ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారిణి పి.కోమలిపద్మ, సహాయ పౌరసరఫరాల అధికారి ధనుంజయరెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు కె. కిషోర్, యం భగీనాద్, ఏ సరత్‌బాబు, జి ప్రవీణ్‌కుమార్, విఆర్‌వోలు బి. పార్వతమ్మ, యం. జ్వోతి తదితరులు పాల్గొన్నారు.