Breaking News

మీ కళ్లను ప్రేమించండి!


-దృష్టి సంబంధిత సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదు
-డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి. శ్యామ్ ప్రసాద్
-వరల్డ్ సైట్ డే సందర్భంగా సంధ్య కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
-వయోవృద్ధుల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరం
-దివంగత డాక్టర్ ఎం.ఎన్. రాజు ఆశయ సాధనకు కృషి చేస్తామని హాస్పిటల్ ఎండీ మునగపాటి భార్గవ్ రామ్ వెల్లడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మనిషి జీవితంలో ప్రతీది దృష్టితో ముడిపడి ఉందని, అందుకే కళ్లను నిర్లక్ష్యం చేయరాదని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి. శ్యామ్ ప్రసాద్ అన్నారు. సంధ్య కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో వరల్డ్ సైట్ డే సందర్భంగా సూర్యారావుపేటలో గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ‘మీ కళ్లను ప్రేమించండి’ అనే నినాదంతో సాగిన ఈ ర్యాలీ ప్రారంభంలో ఆచార్య శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. పుట్టినప్పటి నుంచి ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా దూరమయ్యే వరకు కళ్లను భద్రంగా చూసుకోవాల్సిందేనని తెలిపారు. కంటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసి, నేత్ర సంబంధ సమస్యల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు సంధ్య కంటి ఆసుపత్రి నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను అధికంగా వినియోగించడం వల్ల దృష్టి లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని, స్మార్ట్ ఫోన్లు చూడకుండా, వీడియో గేమ్స్ ఆడకుండా ఉండేలా జాగ్రత్త వహించాలని చెప్పారు. నేత్ర సమస్యలు తలెత్తిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. వరల్డ్ సైట్ డే సందర్భంగా సంధ్య కంటి ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆసుపత్రి ఎండీ మునగపాటి భార్గవ్ రామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరికీ నేత్ర వైద్య సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో సంధ్య కంటి ఆసుపత్రి నెలకొల్పిన దివంగత డాక్టర్ ఎం.ఎన్. రాజు ఆశయ సాధనకు కృషి చేస్తామని వెల్లడించారు. వరల్డ్ సైట్ డే సందర్భంగా వయోవృద్ధుల కోసం వారం రోజుల పాటు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సంధ్య కంటి ఆసుపత్రి గత 36 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తోందని.. అనేక ఉచిత వైద్య శిబిరాలు, పలు అవగాహన సదస్సులను నిర్వహించడం ద్వారా అత్యాధునిక నేత్ర వైద్యాన్ని సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చామని భార్గవ్ రామ్ అన్నారు. ఆసుపత్రి ప్రధాన వైద్య నిపుణులు డాక్టర్ నాగభూషణ్ మాట్లాడుతూ.. కంటి చూపు, నేత్ర సంరక్షణ విషయంలో ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రుల శ్రద్ధ చాలా అవసరమని, ఏదైనా ఇబ్బంది గమనించినట్లయితే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలని సూచించారు. చాలామంది సరైన సమయంలో వైద్యులను సంప్రదించకపోవడంతో శాశ్వత అంధత్వానికి గురవుతున్నారని అన్నారు. ఈ ఏడాది వరల్డ్ సైట్ డే సందర్భంగా ‘మీ కళ్లను ప్రేమించండి’ అనే నినాదాన్ని అందిపుచ్చుకుని ప్రజలందరూ తమ నేత్రాల సంరక్షణపై దృష్టి సారించాలని నాగభూషణ్ కోరారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సంధ్య కంటి ఆసుపత్రి డైరెక్టర్ ఎం. ఇందిర, డాక్టర్ శశికపూర్, విజయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థినులు, సంధ్య కంటి ఆసుపత్రి సిబ్బంది, సామాజిక కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభానికి హాజరైన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *