Breaking News

జాతీయ రాజకీయాల్లో పెనుమార్పు…

-దేశానికి దశ, దిశా నిర్దేశంగా…జాతీయ మహాసభలు
-16న విదేశీ ప్రతినిధుల సందేశాలు
-18న నూతన జాతీయ కార్యవర్గం ఎన్నిక
-సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
-కీలక మలుపుగా మహాసభలు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశానికి ఒక దశ, దిశా నిర్దేశంగా సీపీఐ 24వ జాతీయ మహాసభలు నిలవనున్నాయని, జాతీయ రాజకీయాల మార్పునకు ఇవి ఎంతో కీలకం కానున్నాయని పార్టీ జాతీయ కార్యదర్శి, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు గౌరవాధ్యక్షులు డాక్టర్‌ కె.నారాయణ, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. మహాసభలకు స్వదేశీ, విదేశాల నుంచి వామపక్ష, లౌకికవాద, ప్రజాతంత్ర శక్తులు, వివిధ పార్టీల ప్రముఖులు తరలివస్తున్నారన్నారు. విజయవాడ గురుదాస్‌ దాస్‌గుప్త్తానగర్‌ ప్రాంగణం (ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటరు)లో గురువారం మహాసభల ఆహ్వాన సంఘం విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. నారాయణ మాట్లాడుతూ, ఈనెల 14వ తేదీ సాయంత్రం 3గంటలకు విజయవాడ కేదారేశ్వరిపేట ఫ్రూట్‌ మార్కెట్‌ నుంచి గొప్ప ప్రజా ప్రదర్శన ప్రారంభమవుతుందని, సింగ్‌నగర్‌లోని సీఆర్‌ మైదానం(మాకినేని బసవపున్నయ్య స్టేడియం)లో భారీ బహిరంగ సభ జరుగుతుందని వివరించారు. 15వ తేదీన ఉదయం 10.30 గంటలకు మహాసభలు జరిగే ప్రాంగణంలో జాతీయ పతకాన్ని కామ్రేడ్‌ ఏటుకూరి కృష్ణమూర్తి, పార్టీ పతాకాన్ని సీపీఐ పూర్వపు జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి, అమర వీరుల స్థూపాన్ని సీపీఐ పూర్వపు జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ ఈడ్పుగంటి నాగేశ్వరరావు ప్రారంభిసారన్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు నారాయణ స్వాగతోపన్యాసం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ డి.రాజా మహాసభలను లాంఛనంగా ప్రారంభిస్తారు. 16వ తేదీ సభలో విదేశీ ప్రతినిధులు సందేశాలిస్తారు. 18న నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల నడుమ జరుగుతున్న ఈ మహాసభలు అత్యంత కీలకం కానున్నాయి. బీజేపీ చర్యల వల్ల దేశంలో అస్సలు రాజ్యాంగం ఉంటుందా ? మనుగడ సాగిస్తుందా ? అనే అనుమానాలు స్పష్టంగా కలుగుతున్నాయన్నారు. సీపీఐ ఒక్కటే బీజేపీని ఓడిస్తామని చెప్పడం లేదని విస్పష్టం చేస్తూ అందర్నీ కలుపుకుని బీజేపీపై పోరాటం చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇటీవల వరకు బీజేపీతో అనుకూలంగా ఉన్నారని, ఇప్పుడు వారికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారని నారాయణ పేర్కొన్నారు. బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా పోరాటం చేసినా తాము సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ సైతం కేంద్రం ఏది చెబుతుంటే దానికి సహకరిస్తోందని, అది ఎందుకో తమకు ఏమాత్రం అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రాలను ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం అణిచి వేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రాంతీయ పార్టీలు సమైక్యంగా పోరాడాలని పిలుపిచ్చారు. ప్రజలతో ఉంటారో, బీజేపీతో ఉంటారో జగన్‌ తేల్చుకోవాలని సూచించారు. బీజేపీకి కొమ్ముకాస్తున్న పారిశ్రామికవేత్త అదానీ గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ కుబేరుడయ్యాడని విమర్శించారు. విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ పార్టీ నేతల భూముల ఆక్రమణలు, దోచుకోవడంపై సీఎం జగన్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానన్న జగన్‌, భూముల కబ్జాపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలోని వామపక్ష, లౌకిక ప్రజాతంత్ర శక్తులంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో మోదీని గద్దె దించేందుకు మహాసభలు ఒక వేదిక కానున్నాయని పేర్కొన్నారు. అటు ప్రాంతీయ పార్టీలు, బీజేపేతర శక్తులు సైతం ఐక్యంగా ముందుకు సాగి మోదీ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని, కేంద్రంలోని బీజేపీని గద్దె దించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. .
ప్రత్యేక బస్సులు, రైళ్ల ద్వారా రాక: సీపీఐ నేత రామకృష్ణ
రామకృష్ణ మాట్లాడుతూ దేశ రాజకీయాలను మార్చేలా సీపీఐ జాతీయ మహాసభలు కీలకం కానున్నాయన్నారు. మహాసభలకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. 14న జరిగే ప్రజాప్రదర్శనకు బస్సులు, రైళ్ళు, ఇతర రవాణా వాహనాల ద్వారా పార్టీ శ్రేణులు, సానుభూతి పరులు వేలాదిగా తరలిరానున్నారు. బహిరంగ సభ నిర్వహించే ప్రాంగణాన్ని కామ్రేడ్‌ చండ్ర రాజేశ్వరరావు (సీఆర్‌) మైదానంగా నామకరణం చేశారు. సీఆర్‌ స్వస్థలమైన కృష్ణాజిల్లా మంగళాపురం నుంచి 24 మంది పార్టీ శ్రేణులు జెండాలు పట్టుకుని పాదయాత్రతో సభా స్థలికి చేరుకుంటారు. మహాసభల విజయవంతం కోరుతూ కేరళ రాష్ట్రం కొల్లాం నుంచి 24 మంది యువకులు బైక్‌ ర్యాలీతో నగరానికి చేరుకున్నారని రామకృష్ణ వివరించారు. మహాసభలు జరిగే ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు ప్రముఖ కమ్యూనిస్టు నేత గురుదాస్‌ దాస్‌ గుప్తా ప్రాంగణంగా నామకరణం చేశారు. వాటితోపాటు వివిధ విభాగాలకు షమీమ్‌ ఫైజీ హాల్‌, దాసరి భోజన శాల, రాఘవాచారి బుక్స్‌ఎగ్జిబిషన్‌గా నామకరణం చేసినట్లు వివరించారు. మహాసభలకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నట్లు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లు కేటాయించామని, అటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా స్వతంత్రంగా వివిధ రకాల వాహనాల్లో తరలివస్తున్నారన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, సీపీఐ (ఎంఎల్‌) నాయకులు దీపాంకర్‌ భట్టాచార్య, ఏఐఎఫ్‌బీ నుంచి జి.దేవరాజన్‌ తదితరులు వస్తున్నారని వివరించారు. వామపక్షాల పురిటగడ్డయిన విజయవాడలో కమ్యూనిస్టు ఉద్యమాలకు ఎల్లవేళలా ఆదరణ ఉందని, 47 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహాసభలకూ అనూహ్య స్పందన లభిస్తోందని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం కమిటీ నుంచి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్‌నాయుడు, పార్టీ నాయకులు చలసాని అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అద్భుతమైన, డిజైన్ ఆధారిత ఉత్పత్తి శ్రేణితో AP NAREDCO ఎక్స్‌పోలో ప్రత్యేక ముద్ర వేసిన రీజెన్సీ సెరామిక్స్

-ఎక్స్‌పోలో రీజెన్సీ సిరామిక్స్ ఆవిష్కరణలను NAREDCO ప్రెసిడెంట్ జి హరిబాబు ప్రశంసించారు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెరామిక్స్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *