-పాఠశాల విద్య కమీషనర్ ఎస్. సురేష్ కుమార్
-ముగిసిన యూడైస్ ప్లస్ 47 వ ప్రాంతీయ కార్యశాల
-హాజరైన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన ఆవిష్కరణలతో విద్యాభివృద్ధికి నాంది పలకాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. విజయవాడలో జరిగిన యూడైస్ ప్లస్ 47వ ప్రాంతీయ కార్యసదస్సు ముగింపు సభకు కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబర్ దీవులు, పుదుచ్చేరి, నుంచి రాష్ట్ర, జిల్లా ఎంఐఎస్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమీషనర్ గారు ప్రసంగిస్తూ విద్యాభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాలు బాగా కృషి చేస్తున్నాయని, ఆయా రాష్ట్రాల బెస్ట్ ప్రాక్టీసులు ద్వారా కొత్త ఆలోచనలు పంచుకోవాలని అన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ గణాంక ప్రచురణల విభాగం (డీవోఎస్ఈ &ఎల్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ హెగ్డే వివిధ రాష్ట్రాల డ్రాపౌట్ల వివరాలు, పాఠశాల విద్యలో పీజీఐ (పెరఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్), యూడైస్ ప్లస్ వెబ్ సైటులో వివరాలు నమోదు చేసే పద్ధతుల గురించి వివరించారు. ఆయా రాష్ట్రాల ప్రతినిధులు విద్యాభివృద్ధి కోసం తమ రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలు, సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన మన రాష్ట్రంలో అమలు చేస్తున్న మన బడి: నాడు నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, ఎస్సీఈఆర్టీ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రతినిధులను ఆకర్షించాయని తెలిపారు. మన రాష్ట్రంలో అమలు చేస్తోన్న మన బడి: నాడు నేడు వంటి వినూత్న కార్యక్రమాలను వివిధ రాష్ట్రాల ప్రతినిధులు సందర్శించి తమ రాష్ట్రాల్లో అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ప్రతినిధులకు కమీషనర్ మెమోంటో, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ అధికారులు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్, ప్రభుత్వ గ్రంథాలయాల సంచాలకులు ఎం.ఆర్.ప్రసన్నకుమార్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి, పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి, కాకినాడ ఆర్జేడీ బి.మదుసూధనరావు, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారిణి రేణుక, డిల్లీ ప్రతినిధులు అభిషేక్ కుందు, అల్కా మిశ్రా, సాగర్ చౌదురి తదితరులు పాల్గొన్నారు.