-ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యత
-రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-స్వర సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ప్రారంభం
-ఆరోగ్యకరమైన దంతాలతో ఆనందదాయకమైన జీవితం
-హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎస్.వి. కృష్ణచైతన్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యాధునిక దంత వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో దంత వైద్య సేవలను అందించేందుకు స్వర సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ప్రారంభం కావడం సంతోషదాయకమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులోని స్వర సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.వి. కృష్ణచైతన్య నేతృత్వంలో నెలకొల్పబడిన ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ వి.జి. వెంకటరెడ్డి, ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ విభాగం అదనపు ఎస్పీ ఎస్. శ్రీనివాసరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణను ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యతగా తీసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వివిధ విభాగాలకు సంబంధించిన సమగ్ర వైద్య చికిత్సలను ప్రజలందరికీ చేరువ చేశామని తెలిపారు. స్వర హాస్పిటల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక దంత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విష్ణు పిలుపునిచ్చారు. హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎస్.వి. కృష్ణచైతన్య మాట్లాడుతూ.. దంత సంరక్షణతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, ఆరోగ్యకరమైన దంతాలతో జీవితం ఆనందదాయకమవుతుందని అన్నారు. దంత సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదని, అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య చికిత్సల ద్వారా దంత సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంప్లాంట్, లేజర్ సెంటరుగా తమ హాస్పిటల్ ను తీర్చిదిద్దామని, విశిష్ట స్థాయి దంత వైద్య చికిత్సలను అందించడమే లక్ష్యంగా కృషి చేస్తామని వెల్లడించారు. కేవలం ఒక్క సిట్టింగ్ లోనే, నొప్పి లేకుండా రూట్ కెనాల్ చికిత్సలు అందిస్తామని, లోహ రహిత క్రౌన్స్ అమర్చడం ద్వారా సహజసిద్ధమైన చిరునవ్వును సాధ్యం చేస్తామని చెప్పారు. రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్ చికిత్సలతో పాటు, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, పెరియోడాంటిక్స్, ఆర్థోడాంటిక్స్, లేజర్ డెంటిస్ట్రీ తదితర అత్యాధునిక దంత వైద్య చికిత్సలు తమ హాస్పిటల్లో లభిస్తాయని డాక్టర్ కృష్ణచైతన్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండి డాక్టర్ జి. అవినాష్, సీఈవో వెంకట్, చీఫ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అన్వేష్, పలువురు వైద్య ప్రముఖులు, స్వర హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.