-విద్యుత్ ఉద్యోగుల జి.పి.యఫ్ సాధన సమితి డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ ఉద్యోగుల జి.పి.యఫ్ సాధన సమితి ‘అవగాహనా సదస్సు’ భారీ సభ ఆదివారం గొల్లపూడిలోని శ్రీ పద్మావతి కళ్యాణమండపంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెండి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో 1-2-1999 నుండి 31-8-2004 మధ్యకాలంలో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ జి.పి.యఫ్ లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై గత 20 సంవత్సరాలుగా మేనేజ్‌మెంట్‌కు ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని, తెలంగాణాలో ఈ కాలంలో (1-2-1999 నుండి 31-8-2004) వరకు నియమితులైన వారికి అక్కడి ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని త్వరలో అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని కావున ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూడా త్వరగా సహృదయంతో పరిష్కరించాలని కోరారు. ఈ ఐదేళ్ళ కాలంలో (1999 నుండి 2004 వరకు) ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 6,311 మంది విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలలో నియమితులైనారని, వారికి జీ.వో.నెం : 653, 654 తేది. 22.09.2004 ప్రకారం గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని కోరారు. 2019లో పాదయాత్రలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డిని ఈ సమస్యపై నియమితులైన వారు వివిధ జిల్లాలలో వారికి కలసి విజ్ఞప్తి చేయగా ఈ సమస్యను అధికారంలోని రాగానే త్వరగా పరిష్కరిస్తానని ఇచ్చిన హమీని నెరవేర్చి నియమితులైన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా పాత పెన్షన్ కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఎ.సురేష్‌బాబు, అడ్వైజర్ టి.వి.ఎస్.ఆర్.మూర్తి, నాయకులు అంగదరావు, పరమేశ్వరరావు, శ్రీకాంత్, వేణుగోపాల్, విజయకృష్ణ, అజిత్ కుమార్, పురుషోత్తం, కోటేశ్వరరావు, విశ్వనాధ్ తదితర కంపెనీ, జిల్లా నాయకులు, జెఎసి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.