-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-లోటస్ లో అట్టహాసంగా గడప గడపకు మన ప్రభుత్వం 100 రోజుల వేడుకలు
-కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్న పార్టీ శ్రేణులు
-విజయవాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం: మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల గుమ్మం వద్దకు పాలనను చేరువ చేసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నియోజకవర్గంలో 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సోమవారం లోటస్ సెక్టార్ – 1 లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీశైలజారెడ్డి, డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్ లతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. తొలుత 232వ సచివాలయ పరిధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటించి 180 గడపలను సందర్శించారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికై చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతినెలా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల యోగక్షేమాలపైనే అనుక్షణం దృష్టి సారిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని.. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగుల పాత్ర అభినందనీయమన్నారు. ముఖ్యంగా 43 సచివాలయాల పరిధిలో పర్యటించినప్పుడు ప్రజల నుంచి లభించిన స్పందన అపూర్వమన్నారు. ఈ వంద రోజుల్లో దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న అనేక స్థానిక సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. అలాగే ఆయా సచివాలయాల పరిధిలో గుర్తించిన అభివృద్ధి పనుల కోసం రూ. 8 కోట్ల నిధులు విడుదలైనట్లు తెలియజేశారు. వీటితో పాటు ఈ వంద రోజుల్లో దాదాపు 120 కుటుంబాలకు కుల, ఆదాయ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను తక్షణమే మంజూరు చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు.
మూడేళ్లలో రూ. వెయ్యి కోట్ల ప్రగతిని చూపాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తోన్న సహాయ సహకారాలతో సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు రూ. వెయ్యి కోట్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గత మూడేళ్లలో చేపట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి.. నాడు – నేడు ద్వారా అభివృద్ధి పరిచినట్లు వెల్లడించారు. చంద్రబాబు హయాంలో చెరువులను తలపించిన లోటస్ ప్రాంతాన్ని.. మోడల్ ప్రాంతంగా తీర్చిదద్దడమే ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. అలాగే విద్య, వైద్య, గృహ నిర్మాణ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక నిధులు కేటాయించినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఒక్క విద్యా రంగానికే మూడేళ్లలో రూ. 236.50 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు చెప్పారు. వైద్య రంగానికి సంబంధించి 4 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లను ఒక్కొక్కటి రూ. 80 లక్షల నిధులతో నిర్మిస్తుండగా.. అయోధ్యనగర్ హెల్త్ సెంటర్ ను ఇటీవల ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. వెయ్యికి పైగా నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 6.59 కోట్ల లబ్ధి చేకూరినట్లు తెలిపారు. 28 వేల మంది నిరుపేదలకు రూ. 320 కోట్లతో భూమి కొని పట్టాల రూపంలో ఒక్కొక్కరికి దాదాపు రూ. 6 లక్షలు విలువ చేసే ఆస్తిని సమకూర్చామన్నారు. రహదారుల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గంలో దాదాపు రూ.100 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు మల్లాది విష్ణు చెప్పారు. ముఖ్యంగా విజయవాడ – నూజివీడు రహదారి నియోజకవర్గానికే మణిహారంగా మారిందని తెలిపారు. మరోవైపు గుణదలలో పోలీస్ స్టేషన్ తమ హయాంలోనే ఏర్పాటైందని మల్లాది విష్ణు తెలిపారు. అలాగే సింగ్ నగర్లో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుందని వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి వ్యవస్థ, పార్కులు, పోలీస్ స్టేషన్లు, కమ్యూనిటీ హాళ్లు, ఆర్.యు.బి.లు, ఆర్.ఓ.బి.లు, విద్యుత్ సబ్ స్టేషన్లు.. ఇలా అభివృద్ధి పనులన్నింటినీ నిర్ణీత కాలవ్యవధిలోగా పూర్తిచేసేలా పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
విశాఖ అల్లర్లను టీడీపీ, బీజేపీ సమర్థించడం సిగ్గుచేటు
ప్రశాంత విశాఖ నగరంలో జనసైనికులు అల్లర్లు సృష్టిస్తుంటే పార్టీలకతీతంగా ఖండించవలసింది పోయి టీడీపీ, బీజేపీ సమర్థించడం బాధాకరమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. పైగా మంత్రులు, ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులకు తెగబడిన వారికి మద్ధతు తెలపడం సిగ్గుచేటన్నారు. అధికారం దూరమైందనే అక్కసుతో టీడీపీ, బీజేపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారని ఆరోపించారు. అన్ని ప్రాంతాల ఆకాంక్షలను నెరవేర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. కానీ అందుకు భిన్నంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. విభజన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చారిత్రక తప్పిదాలను పునరావృతం కాకుండా చూడవలసిందిపోయి.. మరలా అభివృద్ధి కేంద్రీకరణకు మద్ధతుగా విపక్షాలు తీర్మాణాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చంద్రబాబు ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా.. అభివృద్ధి వికేంద్రీకరణకే అన్ని వర్గాల ప్రజలు మద్ధతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. 2019 లో జగనన్నపై నమ్మకంతో 151 స్థానాలలో ఘన విజయం అందించిన రాష్ట్ర ప్రజలు.. ఈసారి 175 స్థానాలతో భారీ విజయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడ నగరాన్ని స్మార్ట్ సిటీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక సామాజిక వర్గానికి మేలు చేకూర్చేందుకు పునాదులు కూడా సరిగా పడని అమరావతిని స్మార్ట్ సిటీగా చేసి.. విజయవాడను పూర్తి నిర్లక్ష్యానికి గురిచేశారన్నారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిధులు, వీఎంసీ జనరల్ ఫండ్స్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగపరుచుకుంటూ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో సెంట్రల్ నియోజకవర్గం ప్రగతిలో దూసుకెళుతోందని మేయర్ అన్నారు.
నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. అలుపెరుగని రీతిలో ప్రజాసేవలో తరిస్తున్న నాయకులలో ఒకరు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మరొకరు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అని కితాబిచ్చారు. వైసీపీ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా మాట్లాడుతూ.. ఉడా ఛైర్మన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నాటి నుంచి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వరకు ప్రజలతోనే మల్లాది విష్ణు గారి ప్రయాణం సాగిందన్నారు. కార్పొరేటర్ జానారెడ్డి మాట్లాడుతూ.. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిలో మల్లాది విష్ణు ముద్ర చెరగనిదని పేర్కొన్నారు. నాయకులు ఆత్మకూరు సురేష్ మాట్లాడుతూ.. గతంలో చిత్రసీమలో వంద రోజుల వేడుకలు జరిగేవని, కానీ నేడు అంతకు మించి గడప గడపకు మన ప్రభుత్వం విజయోత్సవ వేడుకలు నిర్వహించుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పలువురు వక్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఎండి షాహినా సుల్తానా, ఇసరపు దేవి, శర్వాణీ మూర్తి, అలంపూరు విజయలక్ష్మి, ఉమ్మడి రమాదేవి, ఉద్ధంటి సునీత, మోదుగుల తిరుపతమ్మ, కుక్కల అనిత, కోఆప్షన్ సభ్యులు గుండె సుభాషిణి, నందెపు జగదీష్, లోటస్ సెక్టార్ – 1 ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, నాయకులు ఆత్మకూరు సురేష్, యరగొర్ల శ్రీరాములు, అలంపూర్ విజయ్, హఫీజుల్లా, బంకా భాస్కర్, ఇసరపు రాజారమేష్, ఉమ్మడి వెంకట్రావు, కనపర్తి కొండా, వెంకటేశ్వరరెడ్డి, వెలగా సురేష్, నాడార్స్ శ్రీను, జి.శ్యామ్, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.