-వారది నుండి కోటినగర్ వరకు రూ.130 కోట్లతో కరకట్ట రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేశాం..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కనకదుర్గమ్మ వారది నుండి కృష్ణలంక కోటినగర్ వరకు కృష్ణానది పరీవాహక ప్రాంతంలో 130 కోట్లతో రక్షణ గోడ నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందని, ప్రకాశం బ్యారేజి నుండి కనకదుర్గమ్మ వారధి వరకు 138 కోట్లతో రక్షణ గోడ నిర్మించేందుకు ప్రభుత్వం పాలనపరమైన అనుమతులు మంజూరు చేయడం జరిగిందని డిల్లీరావు తెలిపారు.
కనకదుర్గమ్మ వారది నుండి కృష్ణలంక కోటినగర్ వరకు కృష్ణానది పరీవాహక ప్రాంతంలో రూ. 130 కోట్లతో రక్షణ గోడ నిర్మాణాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణలంక ప్రాంత వాసులు కృష్ణానది ముంపువలన పడుతున్న కష్టాలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 సంవత్సరంలో 130 కోట్ల రూపాయలను మంజూరు చేసి రక్షణ గోడను నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సుమారు 1.25 కిలో మీటర్ల పొడవున 8.98 మీటర్ల ఎత్తున నిర్మిస్తున్న రక్షణ గోడ పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇటీవల ప్రకాశం బ్యారేజ్ నుండి దిగువ ప్రాంతానికి 5 లక్షల క్యూసెకుల వరద నీటిని విడుదల చేసినప్పటికి ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాలేదన్నారు. రక్షణ గోడ సమీపంలో మరి కొన్ని అక్రమణలను తొలగించవలసి ఉందని, బాధితులకు పత్యామ్నాయ గృహాలను మంజూరు చేసి తొలగింపుల అనంతరం ఆ ప్రాంతాన్ని వాకింగ్ ట్రాక్ గా తీర్చిదిద్దనున్నామన్నారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన శిలాపలకం ప్రాంతం నందు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పార్క్‌ను ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ నుండి కనకదుర్గమ్మ వారది వరకు 1.05 కిలో మీటర్లు పొడవున 138 కోట్లతో మరో రక్షణ గోడను నిర్మించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించి పాలనాపరమైన అనుమతులను మంజూరు చేశారన్నారు. ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రక్షణ గోడ నిర్మాణానికి చేపటవలసిన చర్యలపై నివేదికలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుండి దిగువున ఉన్న కరకట్ట ప్రాంతంలోని వేలాధి కుటుంబాలవారు కృష్ణానది వరద ముంపు నుండి రక్షణ పొందేలా రక్షణ గోడ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా యంత్రాంగం తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
రక్షణ గోడ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జలవనరుల శాఖ రివర్ కన్జర్వేటర్ కృష్ణారావు, తహాశీల్థార్ వెన్నెల శ్రీను, ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు సిబ్బంది ఉన్నారు.