విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధ అమలును కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలను ఆదేశించారు.
నగరంలోని కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సోమవారం సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం, ఫ్లెక్సీ బ్యానర్స్ నిషేధ అమలు, నేషనల్ హైవేస్ పరిసర గ్రామపంచాయతీలో శానిటేషన్ అమలుపై జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1, 2022 నుండి అమలులోకి వచ్చే పర్యావరణ (రక్షణ) చట్టం 1986 ప్రకారం ప్లాస్టిక్ ఫ్లెక్స్ బ్యానర్‌లపై నిషేధాన్ని ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. నిషేధం ప్రకారం ప్లాస్టిక్ ఫ్లెక్సీల తయారీ, దిగుమతి చేయడాన్ని ఎవరూ అనుమతించకూడదన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు ఆయా ప్రాంతాల్లో చట్టాన్ని అమలు చేసేందుకు అవగాహన కల్పించి, చట్ట విరుద్ధంగా నిర్వహిస్తే జరిమానా విధించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయం సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి 75 మైక్రాన్స్ కన్నా తక్కువగా ఉండే ప్లాస్టిక్ ని నిషేధించడం జరిగిందని, నవంబర్ ఒకటో తేదీ నుండి ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లు నిషేధం అమలు జరుగుతుందని, ఈఏడాది డిసెంబర్ 31 నుండి 120 మైక్రాన్స్ కన్నా తక్కువగా ఉండే ప్లాస్టిక్లపై నిషేధం అమలులో ఉంటుందని కలెక్టర్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యారీ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల తయారీ, రవాణా, ముఖ్యంగా నిల్వ చేసే గోదాములపై అధికారులు దృష్టి పెట్టి స్వాధీనం చేసుకోవాలన్నారు. నిబంధన ఉల్లంగిస్తే ఫ్లెక్సీ బ్యానర్ పై స్క్వేర్ ఫీట్ కి వంద రూపాయలు జరిమానా విధించాలని అన్నారు. విజయవాడ నుండి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రసాదంపాడు, రామవరప్పాడు, ఎనికేపాడు, గూడవల్లి కేసరిపల్లి గ్రామపంచాయతీలు శానిటేషన్ మీద దృష్టి పెట్టాలన్నారు. చెత్తను డంపింగ్ చేసే స్థానిక హోటల్స్, కిరాణా షాపులు, షాపింగ్ మాల్స్ తోపుడు బండ్లు యజమానులతో మాట్లాడి శానిటేషన్ పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు ఉపయోగంలోకి తీసుకురావాలని వాటి ద్వారా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ జరగాలన్నారు. ఇప్పటివరకు వినియోగంలోకి రాని ఎస్ డబ్ల్యూ పిసి సెంటర్లను రెండు రోజుల్లో వినియోగంలోకి తీసుకువచ్చి పోసెసింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో జరుగుతున్న శానిటేషన్ ను పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజు ఉదయం క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలన్నారు. ప్రతి మండలంలో కనీసం ఒక గ్రామ పంచాయతీని నూరు శాతం శానిటేషన్ అమలు చేస్తున్న మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డిపిఓ జె.సునీత, డిఎల్ పిఓ డి. శ్రీనివాసరావు, ఎస్ డబ్ల్యూ పిసి అసిస్టెంట్ కోఆర్డినేటర్ కె.కృష్ణ ప్రసాద్, గ్రామపంచాయతీలు కార్యదర్శులు ఈవోపీఆర్డీలు ఉన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …