– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-షాదీఖానాలో రూ. 20 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ, డిప్యూటీ మేయర్లతో కలిసి శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అజిత్ సింగ్ నగర్లోని షాదీఖానాలో మైనార్టీ సోదరులు ప్రార్థనలు చేసుకునే విధంగా రూ. 19.95 లక్షల వ్యయంతో చేపట్టిన గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డిలతో కలిసి శుక్రవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. ఉర్దూను రాష్ట్ర రెండో అధికార భాష హోదా కల్పించడంతో పాటు.. మైనార్టీల సంక్షేమానికి ఏటా భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం హయాంలో ముస్లిం యువతుల వివాహానికి కేవలం రూ. 50 వేలు మాత్రమే ఇచ్చేవారని.. పైగా వందలాది జంటలకు చెల్లింపులు చేయకుండా బకాయిలు పెట్టి వెళ్లారని గుర్తుచేశారు. కానీ మైనార్టీల ఆత్మగౌరవాన్ని కాపాడేలా వైఎస్సార్ తోఫాను ఈ ప్రభుత్వం రూ. లక్షకు పెంచడం జరిగిందన్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ పాలనలో నగరం అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతోందని మల్లాది విష్ణు తెలిపారు. కేవలం మూడేళ్ల కాలంలోనే 30 ఏళ్ల ప్రగతిని చూపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కానీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారని విమర్శించారు. అదే చంద్రబాబు హయాంలో అభివృద్ధి కేవలం శిలాఫలకాలకే పరిమితమైందని.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అంటేనే విజయవాడ సెంట్రల్ అనేలా రూ. కోట్ల నిధులతో ప్రగతి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రతి డివిజన్ ను ఒక యూనిట్ గా చేసుకుని.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 58వ డివిజన్ కు సంబంధించి గత మూడేళ్లలో రూ. 11.09 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అలాగే షాదీఖానాలో మైనార్టీ సోదరులు నమాజ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. గోడ నిర్మాణ పనులు సకాలంలో పూర్తిచేయవలసిందిగా సంబంధిత అధికారులకు సూచించారు.
ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ముస్లిం సోదరులందరూ ప్రార్థనలు నిర్వహించుకునేలా ఎమ్మెల్యే మల్లాది విష్ణు చూపిన చొరవ మరువలేనిదని తెలిపారు. ఈ సందర్భంగా మైనార్టీల తరపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత ఇనుమడింపజేసేలా నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, హఫీజుల్లా, అఫ్రోజ్, రామిరెడ్డి, పఠాన్ నజీర్ ఖాన్, తోపుల వరలక్ష్మి, ఈద్గా కమిటీ సభ్యులు షేక్ నాగూర్, రహీద్, వలీ, రసూల్, తదితరులు పాల్గొన్నారు.