-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 7 లక్షలతో ఆధునికీకరించిన కార్యాలయ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిసరాల పరిశుభ్రత, నగర ప్రగతిలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలో రూ. 7 లక్షల నిధులతో ఆధునికీకరించిన పారిశుద్ధ్య సిబ్బంది కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. నగరంలోని ఆసుపత్రులు, కార్యాలయాలు, రహదారులు ఇలా అన్నిరకాల పరిసరాలను రేయింబవళ్లు పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమన్నారు. ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణ్ లో విజయవాడ నగరం దేశంలోనే మూడవ స్థానంలో నిలవడంలో వీరి పాత్ర మరువలేనిదన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్ల పరిధిలో ప్రస్తుతం 1,300 మంది పారిశుద్ధ్య కార్మికులు, 21 మంది శానిటరీ ఇన్స్ పెక్టర్లు, ఇద్దరు ఏఎంఓహెచ్ లు విధులు నిర్వహిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. స్థానిక కార్యాలయాల ఏర్పాటుతో సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. కరోనా విపత్తు సమయంలోనూ మహిళా పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని గుర్తు చేశారు. ఇటువంటి ఉత్తమ సేవలు అందిస్తున్న కార్మికులకు తమ వంతుగా ఏదైనా సహకారం అందించాలనే ఉద్దేశ్యంతో వారికి నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల వలనే నగరాలు, పట్టణాలు సుందరంగా మారుతున్నాయని.. అటువంటి వారిని గౌరవించుకోవడం మన బాధ్యతగా మల్లాది విష్ణు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్ పెక్టర్ రామ్ నాయక్, నాయకులు దోనేపూడి శ్రీనివాస్, కోలవెన్ను కొండ, చల్లాప్రగఢ గోపాలకృష్ణ, కమ్మిలి రత్న, శనగవరపు శ్రీనివాస్, వెంట్రప్రగఢ రామకృష్ణ, కొత్తూరి తుకారాం బాబు, భాగ్యారావు, బెజ్జం రవి తదితరులు పాల్గొన్నారు.