-మెట్ ఎక్స్ పో, ఇండియా కెమ్ 2022లకు ‘ఈడీబీ’ సన్నద్ధం
-మంత్రులు, అధికారుల బృందంతో పాల్గొనే విధంగా ఏపీఈడీబీ ప్రణాళిక
-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీబీ ప్రతినిధుల బృందంతో సీఈవో సృజన తొలి సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుస రోడ్ షోలు నిర్వహించనున్నట్లు ఏపీ ఈడీబీ సీఈవో సృజన వెల్లడించారు. నవంబర్ మొదటివారంలో ముంబయ్, ఢిల్లీ వేదికగా జరగనున్న మెట్ ఎక్స్ పో, ఇండియా కెమ్ -2022లలో పాల్గొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈడీబీ ప్రతినిధుల బృందాన్ని ఆమె ఆదేశించారు. ఈడీబీ ప్రతినిధుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ నెలలో తైవాన్, జపాన్, దక్షిణ కొరియా దేశాలలో రోడ్ షోలు నిర్వహించే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషించేలా కలిసి ముందుకెళ్ళాలన్నారు. గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికిల్,లాజిస్టిక్ రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్ళలో రోడ్ షోలు, సమావేశాల ద్వారా కుదుర్చుకున్న 18 ఒప్పందాలకు సంబంధించి తదనంతర చర్యలపైనా సీఈవో ఆరా తీశారు.
నవంబర్ 2 నుంచి 3 వరకు ఢిల్లీ ప్రగతి మైదాన్ వేదికగా ఫిక్కి ఆధ్వర్యంలో కెమికల్స్-పెట్రోకెమికల్స్ రంగాలపై ‘ఇండియా కెమ్ -2022’’ పేరిట 11వ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య రాష్ట్రంగా చేరడంతో ప్రత్యేక స్టాల్స్, సీఈవో రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లలో పాల్గొనే అవకాశం లభించింది. వీటిని వినియోగంచుకోవడం ద్వారా విశాఖ-కాకినాడ పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్)తో పాటు పీఎల్‌ఐ స్కీం కింద రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను ఏపీ ఈడీబీ అధికారులు వివరించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ నేతృత్వంలోని ఏపీ ఈడీబీ అధికారుల బృందం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సీఈవో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు రెండు కీలక రంగాలకు చెందిన అంతర్జాతీయ బిజినెస్ ఎక్స్‌పోల్లో భాగస్వామ్యం అవుతున్నట్లు సీఈవో గుమ్మళ్ళ సృజన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్న ఇంజనీరింగ్-టెక్నాలజీ, కెమికల్స్-పెట్రో కెమికల్స్ రంగాలపై ముంబై, ఢిల్లీల్లో జరిగే అంతర్జాతీయ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొంటుందన్నారు. ముంబైలో మెట్ 2022 ఎక్స్‌పో పేరిట మెటీరియల్, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో ఇండియాలోని అవకాశాలను వివరించే విధంగా నాల్గవ ఎక్స్‌పో , నవంబర్ 2-4 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రక్షణ, రవాణా,విద్యుత్ రంగాలకు చెందిన 150కి మందికిపైగా పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఆల్రాటెక్, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ, అక్జో నోబెల్, మహీంద్రా, టాటా స్టీల్ వంటి కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.