Breaking News

విదేశీ వాణిజ్య కేంద్రంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారనున్న కాకినాడ – కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్

-కాకినాడ జె.ఎన్.టి.యూ. ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ.ఐ.ఎఫ్.టి. క్యాంపస్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి
-తీరరేఖలో మెరైన ఉత్పత్తుల ప్రాధాన్యతను అంకుర సంస్థలు బాగా అర్థం చేసుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి
-స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో క్రమంగా ఆదరణ పెరుగుతోంది
-విద్యార్థులు కోర్సును విద్యలా కాకుండా, ఓ అవకాశంగా భావించి నేర్చుకోవాలని సూచన

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐ.ఐ.ఎఫ్.టి) దక్షిణాది క్యాంపస్ ఏర్పాటు ద్వారా విదేశీ వాణిజ్య కేంద్రంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కాకినాడ పాత్ర మరింత కీలకం కానుందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శుక్రవారం ఉదయం కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ.ఐ.ఎఫ్.టి క్యాంప‌స్‌ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ అల్యుమినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అపారమైన ఎగుమతి సామర్థ్యాలతో పలుమార్లు ప్రాముఖ్యత చాటుకున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విదేశీ వాణిజ్యానికి హబ్ గా నిలుస్తున్న కాకినాడలో ఐఐఎఫ్‌టీ ఏర్పాటు ఎంతో సముచితమని పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్ర్రోత్సాహాలు కల్పించక ముందే విశాలమైన సుమారు 700 తీర రేఖలో మెరైన్ ఉత్పత్తుల ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకుని, ఎగుమతి అవకాశాలను ఈ ప్రాంత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అంకుర సంస్థల సాయంతో అందిపుచ్చుకున్నారని, అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశీ వాణిజ్యంలో రాష్ట్రాన్ని ముందు వరసలో నిలిపారని ప్రశసించారు. అలాగే ఫార్మాస్యూటికల్స్, ఆటో, టెక్స్‌టైల్, రైస్, రైస్ బ్రాన్ ఆయిల్, పళ్లు, కూరగాయల వాణిజ్యానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అపార సామర్థ్యం ఉందన్నారు. రాష్ట్రాలు తమ తమ ఉత్పత్తులకు అంతర్జాతీయ ఎగుమతి అవ‌కాశాల‌ను విస్తరించుకునేందుకు విదేశీ ఎంబసీలలో ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ ఆఫీసుల ఏర్పాటుకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించిన అంశాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

దేశంలోని పలు రాష్ట్రాలు ఎన్నో యూరోపియన్ దేశాల కంటే వైశాల్యం ప‌రంగా పెద్దవిగా ఉన్నాయన్న కేంద్ర మంత్రి, వాటిలో ఒక్కొక్క జిల్లా, ఒక్కో విశిష్ట ఉత్పత్పికి కేంద్రంగా ఉందన్నారు. ఈ వైవిధ్యమైన ఉత్పత్తులకు ప్రోత్సాహాలను కల్పించేందుకే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడెక్ట్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. అలాగే ఎన్నో స్థానిక ఉత్పత్పులు అంతర్జాతీయ ఆదరణ చూరగొంటున్నాయని, వాటి ఎగుమతుల ప్రోత్సాహనికి రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఐ.ఐ.ఎఫ్.టి విద్యార్థులు తమ కోర్సును కేవలం అకడమిక్ డిగ్రీ సాధనలా కాకుండా ప్రపంచ వాణిజ్య స్థితిగతులు, సదవకాశాలను నిరంతరం అధ్యయనం చేస్తూ విధాన రూపకల్పనల్లో కేంద్ర వాణిజ్య శాఖకు సూచనలు అందిస్తూ, దేశ ఆర్థిక పురోగతిలో నిర్మాణాత్మక భాగస్వాములు కావాలని సూచించారు. దేశ రాజధాని న్యూడిల్లీలోని క్యాంప‌స్‌, బ్రిటీష్ ప్రెసిడెన్సిలో కొనసాగిన కలకత్తాలోని క్యాంప‌స్‌ల కంటే ఐ.ఐ.ఎఫ్.టి. కాకినాడ క్యాంప‌స్ భిన్నమైనదని, వివిధ ఎగుమ‌తుల‌తో విదేశీ వాణిజ్యంలో కీలక పాత్ర వహిస్తున్న కాకినాడ ప్రాంతంలో ప్రత్యక్ష పరిశీలన ద్వారా విద్యార్థులకు మరింత సమగ్రమైన, క్షేత్ర స్థాయి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు అవ‌కాశం లభించగలదన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర సత్వరాభివృద్ది లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం,  ప్రధాన‌మంత్రి చొర‌వ‌తో ఎయిమ్స్‌, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్‌, ఎన్ఐడీ, ఐఐఎఫ్‌టీ, ఐఐపీ త‌దిత‌ర ప‌ది ప్రతిష్టాత్మక సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేస్తోంద‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బి. రాజేంద్ర నాథ్ రెడ్డి, కె. వెంకట నాగేశ్వర రావు, సి.హెచ్. వేణుగోపాల కృష్ణ, డి. రాజా, పార్లమెంట్ సభ్యులు  వంగ గీత, జి.వి.ఎల్. నరసింహా రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్,  ఎం. భరత్ రామ్ సహా పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *