-మహిళలలో వ్యాధి నిరోదక శక్తిని పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం…
-జిల్లా వ్యాప్తంగా లక్ష మునగ మొక్కలను పంపిణీ చేస్తున్నాం…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి అందించిన ఆకుపచ్చ బంగారం మునగాకు దివ్య ఔషధంగా పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని మహిళలు, గర్భిణీలు, బాలింతలకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మునగ మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలో నిర్వహించిన మునగ మొక్కల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరై మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోటి రకాల మొక్కల జీవనానికి నిలయమైన మనదేశంలో అధిక ఔషధ గుణాలు పోషక విలువలు కలిగిన మొక్క మునగ మాత్రమే అన్నారు. మునగ చెట్టు ఆకు పువ్వు కాయ వ్యాధి నిరోధక శక్తికి ఎంతో దోహదపడతాయన్నారు. మునగాకులో పోటాషియం, కాల్షియం, జింకు, పోటీన్స్, ఖనిజలవణాలు అపారంగా లభిస్తాయన్నారు. గుండె సంబంధమైన వ్యాధులు మధుమేహం క్యానర్స్ వంటి రోగాల నివరణకు దివ్వ ఔషధంగా పని చేస్తుందని జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుందన్నారు. మునగాకును తీసుకోవడం ద్వారా మెదడు బాగా పనిచేసి జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీలు తగినంత మునగాకును తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన ప్రసవం జరిగి చక్కటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుందన్నారు. బాలింతలలో పాల ఉత్పత్తికి దోహదపడుతుందన్నారు. పాశ్చాత్య దేశాలు ఉసిరి, వేప, తులసి వంటి ఔషధ మొక్కలపై పేటెంటు హక్కులు పొంది అనేక రకాల మందులను తయారు చేస్తున్నారన్నారు. రాబోయే రోజులలో మునగమొక్కలపై పేటెంట్ హక్కు తీసుకున్నప్పటికి ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. అటువంటి గొప్ప ఔషధగుణాలున్న మునగ చెట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చి వినియోగించుకునేలా చైతన్య వంతుల్ని చేస్తున్నామన్నారు. ప్రజలకు ఆరోగ్య వంతమైన సమాజాన్ని అందించలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మునగ చెట్లను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. ఆయన సూచనల మేరకు ఉపాధి హామి పథకం ద్వారా లక్ష మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జె. సునీత మాట్లాడుతూ ఉపాధి హామి పథకం ద్వారా జిల్లాలో ఉపాధి కోరిన ప్రతి ఒక్కరికి పని కల్పిస్తున్నామన్నారు. ఈఏడాది 30 లక్షల పని దినాలు కల్పించాలనే లక్ష్యం కాగా ఇప్పటి వరకు 52 లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలో మన జిల్లా రెండవ స్థానంలో ఉందన్నారు. వ్యక్తిగతంగా మునగ తోటలు పెంచుకునే వారికి మునగ మొక్కలను ఉచితంగా పంపిణీ చేసి సంరక్షణకు సహాయం అందిస్తామన్నారు. జిల్లాలో 97 ఎకరాలలో మునగ తోటలనురైతులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. స్వయం సహాయ బృందాల ద్వారా 20 నర్సరీలలో లక్షకుపైగా మునగ మొక్కలను పెంచి ప్రతి ఇంటికి రెండు చొప్పున మునగ మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
మునగ చెట్ల పంపిణీ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం యంపిపి పాలడుగు జోత్స్న, పిఏసిఎస్ అధ్యక్షులు షేక్ జిలాని భాషా, గ్రామ సర్పంచ్ నలినీ ఆశలత, యంపిడివో బి రామకృష్ణ నాయక్, యంఆర్వో యం సూర్యారావు, సచివాలయ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు.