-ఇళ్ల రిజిస్ట్రేషన్ పేరిట గత పాలకులు నిండా మోసగించారని ఆవేదన వ్యక్తం
-తమకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందజేత
-సంక్రాంతి నాటికల్లా ఉచిత రిజిస్ట్రేషన్లు చేస్తామని హామీ ఇవ్వడంపై హర్షం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని భానునగర్ వాసులు శనివారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ పేరిట గత పాలకులు తమను నిలువుగా మోసగించారని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఒక్కో కుటుంబం నుంచి రూ. 70 వేల నుంచి రూ. లక్ష వరకు బలవంతపు వసూళ్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని.. వర్షాలకు ఇళ్లు పెచ్చులూడుతున్నా రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించలేని దయనీయ స్థితిలో ఉన్నట్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరిగేలా చూడాలని మల్లాది విష్ణుని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. గతంలో మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా ఉండగానే ఈ ప్రాంతంలో 20 ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేయించి ఆ కుటుంబాలను ఆదుకున్నారని.. ఎలాగైనా తమ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. స్పందించిన ఆయన ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడటం జరిగిందన్నారు. సంక్రాంతి కల్లా నిషేధిత భూములతో పాటు అర్బన్ ల్యాండ్ సీలింగ్ లోని స్థలాల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. 150 గజాల లోపు ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్ లు చేస్తామని చెప్పడంతో.. కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు చూపుతున్న చొరవకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నాయకులు కొండాయిగుంట బలరాం, కాలనీవాసులు ఉన్నారు.