-తోటి ఆర్యవైశ్యులపై అసత్య ఆరోపణలు తగదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ, భవానీపురం, బబ్బూరిగ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆర్యవైశ్య కార్తీక వనసమారాధన-ఆత్మీయ సమ్మేళనం విజయవంతం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సంఘం అధ్యక్షుడు పల్లపోతు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి) కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య కార్తీక వనసమారాధన విజయవంతంగా ముగియడంతోపాటు, ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం హనుమాన్‌పేటలోని ఆర్యవైశ్యసంఘం భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కొండపల్లి బుజ్జి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్యవైశ్య కార్తీక వనసమారాధన-ఆత్మీయ సమ్మేళనం, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించామని పేర్కొన్నారు. మాజీమంత్రి వెలంపల్లి నాయకత్వంలో 64 డివిజన్ల ఆర్యవైశ్యులంతా ఒక తాటిమీద ఉండాలని ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించమన్నారు. 25 వేల మందికి అన్న వితరణ కార్యక్రమంతోపాటు 600 ఆర్యవైశ్య కుటుంబాలకు సత్యనారాయణవ్రత కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యలందరూ అందరూ రాలేక పోయినా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య నేతలు మాట్లాడుతూ ఈ కార్యక్రమం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సారేపల్లి రాకేష్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే విజయవాడ నగరంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఆర్యవైశ్యుడై వుండి తోటి ఆర్యవైశ్యులను కించపరుస్తూ మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు. మూడు కోట్లు ఎవరు వసూలు చేశారో వాటి వివరాలను తెలిపాలని, లేనిపక్షంలో ఆయన షాపు ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.