Breaking News

ఏపీఎస్పీఎఫ్ సమస్యల పరిష్కారదిశగా చర్యలు

-ఎస్.ఐ.లకు సత్వర పదోన్నతి, ఖాళీల భర్తీ, హెడ్ క్వార్టర్, డాగ్ స్క్వాడ్ ఏర్పాటు తదితర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం
రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటి సత్వర పరిష్కారానికి తగు చర్యలను తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో ఏపీఎస్పీఎఫ్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణకు ఏపీఎస్పీఎఫ్ అధికారులు తీసుకుంటున్న చర్యలు, విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, మంజూరు చేయాల్సిన అనుమతులు తదితర అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సుదీర్ఝంగా సమీక్షించారు. ఏపీఎస్పీఎఫ్ కార్యకలాపాలు, ఎడ్మినిస్ట్రేటివ్ సెట్అఫ్, దాని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ఉద్యోగుల సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, పొందాల్సిన అనుమతులు తదితర అంశాలను ఏపీఎస్పీఎఫ్ డి.జి. సంతోష్ మెహ్ర, డి.ఐ.జి. బి.వి. రామిరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుండి పరిపాలనా అనుమతులు పొందాల్సిన సమస్యలకు సంబందించిన ప్రతిపాదనలు వెంటనే తమకు అందజేసినట్లైతే, వాటన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తగుచర్యలను తీసుకుంటామని ఏపీఎస్పీఎఫ్ అధికారులకు ఆమె సూచించారు.
అనంతరం తన ఛాంబరులో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఏపీఎస్పీఎఫ్ లో ఎంతో సుశిక్షితులైన అధికారులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ఎంతగానో కృషిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, కడప తదితర ప్రాంతాల్లోనున్న విమానాశ్రయాలు, అసెంబ్లీ, హైకోర్టు మరియు టి.టి.డి., అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, విజయవాడ శ్రీ దుర్గామల్లీశ్వర స్వామి వారి దేవస్థానాలకు చెందిన దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు వీరు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అటు వంటి శాఖలో పనిచేసే ఎస్.ఐ. కేడర్ ఉద్యోగికి 15 సంవత్సరాలు దాటినా సి.ఐ.గా పదోన్నతి రావడం కష్టంగా ఉందన్నారు. అదే పోలీస్ శాఖలో ఎస్.ఐ.గా పనిచేసే ఉద్యోగి కేవలం ఏడెనిమిది సంవత్సరాల్లోనే సి.ఐ.గా పదోన్నతి పొందడం జరుగుచున్నదన్నారు. ఈ సమస్యకు ఏవిధంగా సత్వర పరిష్కారం చూపాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఖాళీగా ఉన్న పోస్టులను అన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు చర్యలను తీసుకుంటామన్నారు. ఈ శాఖకు డాగ్ స్క్వాడ్ సేవలు అవసరమనే విషయాన్ని గుర్తించడం జరిగిందని, వాటి ఏర్పాటుకు కూడా చర్యలను తీసుకుంటామని ఆమె తెలిపారు. ఏపీఎస్పీఎఫ్ కి శాశ్వత ప్రాతిపదికన హెడ్ క్వార్టర్ అవసరమనే అంశాన్ని కూడా గుర్తించడం జరిగిందని, ఈ సమస్యలను కూడా పరిష్కరించే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతామని ఆమె తెలిపారు. మంగళవారం జైళ్ల శాఖ పనితీరును సమీక్షించడం జరిగిందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలోని ఖైదీలకు కూడా ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తించేలా ముఖ్యమంత్రి అవకాశాన్నికల్పించారన్నారు.
ఈ సందర్బంగా పలువురు పాత్రికేయిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాదానం చెపుతూ ఖైదీలు చేసే వస్తువులపై జిఎస్టీ మినహాయింపు విషయాన్ని సమగ్రంగా చర్చించి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని, వారికి కూడా ఏపీఎస్పీఎఫ్ లో అవకాశం కల్పించే చర్యలను తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు సంబందించిన అంశంపై ఎయిపోర్టులో పనిచేసే పోలీసు లపై ఇప్పటికే చర్యలను తీసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. లోన్ యాప్స్ వల్ల మోసపోయే వారు స్థానిక పోలీస్ స్టేషన్లలో గాని, కాల్ సెంటర్ కు గాని పోన్ చేసి పిర్యాదు చేసినట్లైతే తక్షణ చర్యలను తీసుకోవడం జరుగుతుందని, కానీ దురదృష్ట వశాత్తూ చాలా మంది ఈ విధంగా పిర్యాదు చేయకపోవడం వల్ల సమస్యలు జఠిలం అవుతున్నాయన్నారు. లోన్ యాప్స్ ద్వారా మోసం చేసే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని ఆమె తెలిపారు .
ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్, ఏపీఎస్పీఎఫ్ డి.జి. సంతోష్ మెహ్ర, డి.ఐ.జి. బి.వి. రామిరెడ్డి, కమాండెంట్లు కె.ఎన్.రావు, డి.ఎన్.ఏ. బాషా, ఎం.శంకరరావు, డి.కె.ఎస్.రాజు, ఎక్కౌంట్స్ ఆఫీసర్ కె.వి.ఎస్. శర్మ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *