గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మట్టిలో మాణిక్యాలుగా ఉన్న క్రీడకారులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ ఇవ్వటానికి శాప్ హ్యాండ్ బాల్ అకాడమీని ఏర్పాటు చేయటం జరిగిందని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా తెలిపారు. బుధవారం తెనాలి లోని ఎఎస్ఎన్ స్టేడియంలో శాప్ హ్యాండ్ బాల్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా, తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్, యువజన సర్వీసులు, క్రీడలు ముఖ్య కార్యదర్శి జి. వాణి మోహన్, శాప్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలసి పాల్గొన్నారు. ఎఎస్ఎన్ స్టేడియం ఆవరణలో మంత్రి ఆర్ కె రోజా ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి, శాప్ హ్యాండ్ బాల్ అకాడమీ క్రీడాకారులకు కేటాయించిన వసతి గదులను పరిశీలించారు. శాప్ హ్యాండ్ బాల్ లోగోను ఆవిష్కరించి హ్యాండ్ బాల్ కోర్డును రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.
శాప్ హ్యాండ్ బాల్ అకాడమీ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ ను పంపిణీ చేసి కోర్టులో కొద్దిసేపు మంత్రి ఆర్ కె రోజా హ్యాండ్ బాల్ ఆడి గోల్ చేసారు. ఈ సందర్బంగా జరిగిన సభలో….
రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా మాట్లాడుతూ… చదువు జ్ఞానాన్ని అందిస్తే, ఆటలు ఆరోగ్యాన్ని అందిస్తాయని, శారీరక దృఢత్వంతో పాటు మానసికంగాను స్తిరంగా వుండి మెదడు చురుకుగా పని చేసి మంచి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అశయాలను సాధనకు, రాష్ట్ర అభివృద్దికి, పేద ప్రజల చిరునవ్వులు చూడాలని లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాష్ట్రంలో 151 సీట్లు గెలిచారని, అదే విధంగా ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకోని క్రీడకారులు ఎన్ని ఇబ్బందులు ఎదురైన లక్ష్యసాధనకు నిరంతరం కష్టపడి విజయం సాధించాలన్నారు. తెనాలిలో ఏఎస్ఎన్ స్టేడియంలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో శాప్ హ్యాండ్ బాల్ అకాడమీ తెనాలి డబల్ హార్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇదే విధంగా నియోజకవర్గాల్లోనూ, జిల్లాలోని శాప్ స్టేడియాలలో అకాడమీ ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలు సహకారం అందించాలన్నారు. తెనాలి శాప్ హ్యాండ్ బాల్ అకాడమీలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 53 మంది క్రీడాకారులల్లో అత్యంత ప్రతిభ చూపిన 20 మందిని ఎంపిక చేసి హ్యాండ్ బాల్ టీమును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీరికి క్రీడల్లో పూర్తిస్థాయి తర్ఫీదు ఇవ్వడంతో పాటు, పౌష్టికాహారం, ఫిట్నెస్ కు సంబంధించి ఆరోగ్య పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జాతీయ స్థాయిలో విజయమే లక్ష్యంగా టీము సభ్యులందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామ స్థాయిలో స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వారి వివరాలను సేకరించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ టోర్నమెంట్లు జరిగినపుడు సంబంధిత క్రీడల్లో ప్రావీణ్యం వున్న వారికి ఆహ్వానం పంపించి వారు క్రీడల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శాఫ్ ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడు లేని విధంగా రూ. 50 లక్షల విలువ గల బహుమతులతో జగనన్న క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గ స్థాయి టీములకు జిల్లా స్థాయిలోను, జోనల్ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు డిసెంబర్ 21 వ తేదిన ఫైనల్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో గుర్తింపు తెచ్చుకోవడం వలన మంచి భవిషత్తు ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. ఇటీవల హాకీ క్రీడలో ప్రతిభ చూపిన రాష్ట్రానికి చెందిన రజనికి, దివ్యాంగుల క్రీడల్లో ప్రతిభ చూపిన జాస్మిన్ కు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. అకాడమీ ఏర్పాటుకు కృషి చేసిన స్థానిక శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు, ఆర్ధిక సహకారం అందిస్తున్న తెనాలి డబల్ హార్స్ ఎండీ మునగాల శ్యామ్ ప్రసాద్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నామన్నారు.
తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ప్రపధమంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన శాప్ హ్యాండ్ బాల్ అకాడమీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెనాలిలో స్వాతంత్ర్య సమరయోధులు, అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉన్న కళాకారులతో పాటు, ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో పతకాలు సాధించిన ఘనత ఉన్న క్రీడాకారులు ఉన్నారన్నారు. ఏఎస్ఏన్ స్టేడియంలో హ్యాండ్ బాల్ అకాడమీ క్రీడలకు సంబంధించి అన్ని రకాల మౌళిక వసతులు కల్పించడం జరిగిందని, తెనాలి డబల్ హార్స్ వారు సంవత్సరం పాటు అకాడమీ నిర్వహణకు స్పాన్సర్ షిప్ ఇచ్చారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఏఎస్ఎన్ స్టేడియాన్ని క్రీడా అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం జరిగిందని, క్రీడా హబ్ ల వల్ల ఎక్కువ మంది క్రీడాకారులకు అవకాశం కలుగుతుందన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1300 కోట్ల రూపాయల అబివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు. శాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ బాల్ అకాడమీ క్రీడాకారులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ పోటీలలో చక్కగా రాణించాలన్నారు.
యువజన సర్వీసులు, క్రీడలు ముఖ్య కార్యదర్శి జి. వాణి మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిభ వున్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ హాస్టల్స్ ను ఏర్పాటు చేసి వారికి మంచి శిక్షణ అందించేందుకు శాప్ ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. యువత గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని నిరంతరం శిక్షణ పొందుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్నాలన్నారు.
శాప్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా చరిత్రలోనే ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం కార్పోరేట్ కంపెనీలతో కలసి శాప్ ఆధ్వర్యంలో హ్యాండ్ బాల్ అకాడమీని ఏర్పాటు చేయడం తెనాలిలోనే ప్రారంభమయిందన్నారు. తెనాలిలో హ్యాండ్ బాల్ అకాడమీ ఏర్పాటుకు స్థానిక శాసన సభ్యులు అన్నబత్తుని శివకుమార్, తెనాలి డబల్ హార్స్ సంస్థ, కోచ్ లు, మున్సిపల్ పాలక వర్గం, క్రీడాభిమానులు ఎంతో ప్రోత్సాహం అందించారన్నారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి క్రీడలను ప్రోత్సహించేందుకు పంచాయితీ సెక్రటరీని గ్రామ క్రీడాధికారిగా నియమించడం జరిగిందని, దీని వలన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ గతం కంటే 70 రెట్లు బలోపేతం అయిందన్నారు. ప్రతి గ్రామంలో క్రీడా క్లబ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి వరకు 5970 క్రీడా క్లబ్ లు ఏర్పాటు అయ్యాయని, క్రీడా కారులందరు స్పోర్ట్స్ క్లబ్ యాప్ లో నమోదు అవ్వాలన్నారు. గత చరిత్రలో లేని విధంగా రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ తో నాలుగు ప్రధాన క్రీడలకు సంబంధించి నవంబర్ 10 నుండి జగనన్న క్రీడా సంబరాలలో భాగంగా టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గ స్థాయిలోని జట్లకు జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలలో పోటీలు నిర్వహించి ప్రధమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 5 లక్షలు, ద్వితీయ స్థానం జట్టుకు రూ. 3 లక్షల నగదు బహుమతులు ఇవ్వడంతో పాటు, క్వార్టర్ ఫైనల్స్, సెమి ఫైనల్స్ లో ఓటమి చెందిన జట్లకు నగదు బహుమతి అందించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ పి. శైలజ, తెనాలి మున్సిపల్ చైర్ పర్సన్ ఖలేదా నసీం, డిఎస్పీ శ్రవంతి రాయ్, తెనాలి డబల్ హార్స్ ఎండీ మునగాల శ్యామ్ ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్లు హరి ప్రసాద్, కోటేశ్వరరావు, కౌన్సిలర్ యం. సంధ్యారాణి, స్టెఫ్ సిఇఓ పి. వెంకటనారాయణ, శాప్ హ్యాండ్ బాల్ అకాడమీ కోచ్ నాగరాజు, డిఎస్ఏ చీఫ్ కోచ్ మహేష్ బాబు, యన్.వెంకటేశ్వరరావు, పి.సత్యనారాయణ రాజు, క్రీడాకారులు పాల్గొన్నారు.