విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి, మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు అన్నారు. గురువారం కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొట్టెటి హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కబ్జాకోరుగా పేరుగాంచిన మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తుంటే నవ్వొస్తుందని, అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిని మరిచిపోయి, మంత్రిగా అభివృద్ధిని పరివేక్షించి దగ్గరుండి చేయాల్సిన బాధ్యత మానేసి, ఎక్కడ భూములు ఉంటే అక్కడ కబ్జాలు చేసే నువ్వు తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తావా, రాష్ట్రంలో మీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ప్రజలందరికీ తెలుసని, మీ భూకబ్జాలు, మీ అవినీతి కచ్చితంగా తెలుగుదేశం పార్టీ బయటపెడుతుందని, వాటి మీద పోరాడుతుందని, మీ అవినీతి మీద ఎన్నిసార్లు విచారణ జరిగిన, సాక్షాధారాలతో నీ అవినీతి బయటపడినా నీకున్న రాజకీయ పలుకుబడితో బయటపడకుండా ఆపించుకున్నావ్, నీ గురించి నీ చరిత్ర గురించి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసని, కాబట్టి నీతి గురించి, న్యాయం గురించి, మాట్లాడటానికి నీకు అర్హత లేదని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నీ తమ్ముడిని నమ్మినంతగా కూడా, నిన్ను ఎందుకు నమ్మడం లేదు నువ్వు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాల జగన్ రెడ్డి ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ పోరు కొనసాగుతుందని, ఎన్ని ఆటంకాలు సృష్టించిన, ఎన్ని నిర్బంధాలు పెట్టిన కచ్చితంగా పోరాడుతామని ఆయన తెలియజేశారు.
విజయవాడ అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు మొహమ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా రైతులు పాదయాత్ర చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చిన ఈ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, అడుగడుగునా పాదయాత్ర అడ్డుకుంటుందని, ఇది సరైన సరైన చర్య కాదు అని ఆయన అన్నారు. ఒకే రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అసెంబ్లీ సాక్షిగా చేసిన తీర్మానాన్ని ఈ ప్రభుత్వం విస్మరించి ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు దోమకొండ రవికుమార్, బ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.