Breaking News

ప్రజల ఆశీస్సులే జగనన్నకు కొండంత బలం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-24వ డివిజన్ 92 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజల ఆశీస్సులే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొండంత బలమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గురువారం 24 వ డివిజన్ 92 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మాణిక్యం వీధి, బెల్లపు శోభనాద్రి వీధి, ఆర్.సి.ఎం. చర్చి రోడ్డు, అంబేద్కర్ కాలనీలలో విస్తృతంగా పర్యటించి.. 246 గడపలను సందర్శించారు. మూడేళ్ల పాలనలో అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. గత పాలకులకు కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తొచ్చే వారని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో మమేకమయ్యే బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అనేక స్థానిక సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాలనీలలో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ప్రజల తాగునీటి అవసరాల దృష్ట్యా పలుచోట్ల మంచినీటి పంపులను ఏర్పాటు చేయవలసిందిగా వీఎంసీ సిబ్బందికి సూచించారు. ఇళ్లపై మలేరియా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించిన ఆయన.. ఈ వారం క్షేత్రస్థాయి పర్యటన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. విధులలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని.. క్రమంతప్పకుండా ఫీల్డ్ విజిట్ చేయాలని ఆదేశించారు. అలాగే వీధులలో రాత్రుళ్లు మందుబాబులు సంచరించకుండా గస్తీ పెంచాలని పోలీస్ శాఖకు సూచించారు.

సచివాలయ పరిధిలో రూ. 5.30 కోట్ల సంక్షేమం
92 వ వార్డు సచివాలయ పరిధిలో మూడేళ్లలో రూ. 5.30 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 241 మందికి ప్రతినెలా క్రమం తప్పకుండా ఇంటివద్దకే పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 263 మందికి రూ. 36.82 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 60 మందికి రూ. 17.48 లక్షలు., చేయూత ద్వారా 137 మందికి రూ. 25.68 లక్షలు., కాపునేస్తం ద్వారా 13 మందికి రూ. 1.95 లక్షలు., సున్నావడ్డీ ద్వారా 860 మందికి రూ. 15.29 లక్షలు., చేదోడు ద్వారా 20 మందికి రూ. 2 లక్షలు., జగనన్న తోడు ద్వారా 12 మందికి రూ. 1.20 లక్షలు., వాహనమిత్ర ద్వారా 18 మందికి రూ. 1.80 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. అలాగే డివిజన్లో 8 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 4.85 లక్షల లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

అయ్యన్న అక్రమాలకు టీడీపీ నేతలు వత్తాసు పలకడం సిగ్గుచేటు
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి అరెస్ట్ సబబేనని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా.. ఫోర్జరీ పత్రాలతో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడంతోనే సీఐడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అయ్యన్నకు వ్యవస్థలన్నా, ప్రభుత్వమన్నా కనీస గౌరవం ఉండదని మండిపడ్డారు. మహిళలు ఉండగానే రాయలేని భాషలో సభ్యసమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేస్తుంటారని దుయ్యబట్టారు. అటువంటి వ్యక్తికి తెలుగుదేశం నాయకులంతా వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. మరోవైపు దశాబ్దాల కాలంగా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 150 గజాల లోపు ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ లు చేయడంతో పాటు.. 150 గజాల పైన ఇళ్లకు నామమాత్రపు రుసుముతో రిజిస్ట్రేషన్లు జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలతో దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన టాప్‌ ప్లేస్‌ లో నిలిచారని మల్లాది విష్ణు అన్నారు. అది చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల విషప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు కొమ్ము చంటి, బెల్లపు సత్యనారాయణ, బెల్లపు వెంకట్రావు, ఓబిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఆపూరి మనోహర్, క్రాంతి, మోహన్ రావు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *