-7 జాతీయ స్థాయిలో,10 రాష్ట్ర స్థాయిలో మొత్తం 17 నూతన వంగడాలు ఆవిష్కరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడితో పాటు నాణ్యత మరియు చీడపీడలను తట్టుకునే 17 రకాల నూతన వంగడాలను రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి గురువారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో ఆవిష్కరించారు. రైతులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చే ఈ నూతన వంగడాలను రూపొందించిన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎ.విష్ణువర్థనరెడ్డిని, శాస్త్రవేత్తలను మరియు ఏపి సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పెర్సన్ పి.సుస్మితా రెడ్డిని, మేనేజింగ్ డైరెక్టర్ డా.శేఖర్ బాబును మంత్రి అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎటు వంటి బౌగోళిక, వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొని వాణిజ్య సరళిలో సాగుకు అవకాశం ఉన్న వరి, రాగి మరియు ప్రత్తి పంటల్లో 7 జాతీయ స్థాయి నూతన వంగడాలకు ఇప్పటికే కేంద్రం అనుమతి రావడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో అభివృద్ది పర్చిన నూతన వంగడాలను జాతీయ స్థాయిలో అనుమతి రావడం ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికే కాకుండా మన రాష్ట్రానికే ఎంతో గర్వకారణమన్నారు. అదే విధంగా వరి, రాగి, కొర్ర, మినుము, పెసర, శనగ, మరియు వేరుశనగ పంటల్లో 10 రాష్ట్ర స్థాయి నూతన వంగడాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. రాష్ట్ర స్థాయిలో ఆవిష్కరించిన ఈ 10 నూతన వంగడాలను కూడా దేశ స్థాయిలో ఉపయోగించుకొనే అవకాశాన్ని పరిశీలించిన తదుపరి జాతీయ స్థాయి ఉపయోగానికి అనుమతి లబించినట్లైతే మరో 10 నూతన వంగడాలను దేశానికి అందించిన ఘనత రాష్ట్రానికి దక్కడం ఒక రికార్డే అని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర స్థాయిలో ఆవిష్కరించిన వరి యం.టి.యు.-1318 నూత వంగడానికి ఎంతో ప్రాచుర్యం ఉందని, రైతులు ఈ నూతన వంగడాన్ని ఎంతగానో ఆసిస్తున్నారని ఏ.పి. సీడ్స్ అధికారులు చెపుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో నేడు విడుదల చేసిన ఈ నూతన వంగడాలను అన్నింటినీ ఒక సారి పరీక్షించి, సర్టిపై చేసి అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులోకి తేవడం జరుగుతుంది మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో అమలు పరుస్తున్న పలు వ్యవసాయ సంస్కర్ణలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు రాష్ట్రానికి వస్తున్నాయని, ఆ నేపధ్యంలోనే ఏ.పి.సీడ్స్ డవలెప్మెంట్ కార్పొరేషన్ కు ఒక జాతీయ స్థాయి అవార్డు నేడు రావడం జరిగిందంటూ ఆ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బాబుకు మంత్రి అభినందలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమం, అభివృద్ది విషయంలో కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్దకు అనుగుణంగా అనేక వ్యసాయ అనుబంద సంస్థలు ఆ దిశగా కృషిచేస్తున్నాయని, అందుకు ఈ నూతన వంగడాల ఆవిష్కరణే నిదర్శనమని ఆయన అన్నారు. ఇదే విధంగా పరిశోదనలను కొనసాగించి తక్కువ పెట్టుబడితే అదిక దిగుబడులను సాదించే నూతన వంగడాలను మరిన్ని ఆవిష్కరించేందుకు మరియు రైతాంగానికి అన్ని విదాలుగా అండగా ఉండటానికి, సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుదని ఆయన అన్నారు.
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎ.విష్ణవర్థన రెడ్డి, ఏపి సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పెర్సన్ పి.సుస్మితా రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డా.శేఖర్ బాబు, ఏపి సీడ్స్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్ డా.త్రివిక్రమ్, డైరెక్టర్ ఆఫ్ రిసెర్చు డా.ఎల్.ప్రశాంతి తదితరులు ఈ ఆవిష్కర్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు.