-14న సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహణ
-హాజరు కానున్న గవర్నర్ బిశ్వభూషణ్, హైకోర్టు జస్టిస్ సోమయాజులు
-తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేయనున్న 3వేల మంది విద్యార్థులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ఈ నెల 14న (సోమవారం) నగరంలోని పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు వీజీఆర్ డయాబెటీస్ స్పెషాలిటీస్ హాస్పటల్ అధినేత డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి(వీజీఆర్) తెలిపారు. శనివారం మొగల్రాజపురంలోని వీజీఆర్ హాస్పటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వీజీఆర్ మాట్లాడుతూ.. వీజీఆర్ డయాబెటీస్ ఎడ్యుకేషనల్ అండ్ అవెర్నస్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గడచిన రెండు దశాబ్ధాలుగా మధుమేహ వ్యాధిపైన నిరంతరం పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు 10లక్షల మంది విద్యార్థుల్లో మధుమేహ వ్యాధి నియంత్రణ, నివారణపై అవగాహన కల్పించామని తెలిపారు. గడచిన దశాబ్ధ కాలంలో 2లక్షల మంది విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 400 పాఠశాలలు నుండి 50 వేల మంది విద్యార్థులు మధుమేహ వ్యాధి నియంత్రణ, నివారణ, జీవనశైలిలో మార్పులు గురించి నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. నవంబరు 14ను పురస్కరించుకుని ఈరోజు మధుమేహ వ్యాధి గురించి కల్పించే అవగాహన భవిష్యత్తుకు భరోసాను, భద్రతను కల్పిస్తుందని ఈ ఏడాది ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్(ఐడిఎఫ్) పిలుపునిచ్చిందని తెలిపారు. గడచిన రెండు దశాబ్ధాలుగా మధుమేహ వ్యాధి నియంత్రణ, నివారణపై అవగాహన కల్పించే క్రమంలో విద్యార్థులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో వీజీఆర్ డయాబెటీస్ అట్లాస్, వీజీఆర్ డయాబెటిస్ స్టూడెంట్ బుక్‌లెట్, వీజీఆర్ డయాబెటిస్ పేషెంట్ గైడ్ పుస్తకాలను రచించి దాదాపుగా 8లక్షలు పుస్తకాలను సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు, ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులకు ఉచితంగా అందజేశారు. 14న సిద్ధార్థ ఆడిటోరియంలో జరగబోయే మధుమేహ వ్యాధిపై అవగాహన సదస్సుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా, గౌరవ అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు, ప్రత్యేక అతిథులగా పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా, వైద్యా ఆగరో్య శాఖ మంత్రి విడుదల రజనీతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ జెడ్పీ ఛైర్‌పర్స్‌న్ పాతూరి నాగభూషణం, వైయస్సార్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యాంప్రసాద్, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. కార్యక్రమంలో 3వేల మంది విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేస్తారని పేర్కొన్నారు. మధుమేహ వ్యాధి నియంత్రణ, నివారణపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఇతర అతిథులు చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తారని డాక్టర్ వీజీఆర్ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ టి.జె.ప్రసన్నకుమార్, డాక్టర్ పి.రాజు, డాక్టర్ జె.ఎస్.ఎన్.ప్రసాద్, డాక్టర్ తనూజ, తదితరులు పాల్గొన్నారు.