తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆం.ప్ర రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి వారిచే జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు పెద్ద ఎత్తున జరపబోతున్నట్లు, అలాగే క్రీడా శాఖ తరఫున వివిధ క్రీడల పోటీలు జోనల్ రాష్ట్ర స్థాయిలో జరప బోతున్నామని అలాగే పోటీలో విజేతలకు బహుమతులు గౌరవ ముఖ్యమంత్రి జన్మదినాన విజేతలకు అందచేయబోతున్నట్లు తెలుపుతూ జగనన్న మన రాష్ట్ర యూత్ ఐకాన్ అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి ఆర్ కే రోజా అన్నారు.
ఆదివారం స్థానిక బ్లిస్ హోటల్ నందు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలకు సంబంధించిన పోస్టర్లను మంత్రి విడుదల చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోనల్ స్థాయి పోటీలు తిరుపతి, గుంటూరు, రాజమండ్రి మరియు విశాఖపట్నం కేంద్రంగా మరియు రాష్ట్ర స్థాయి పోటీలు విజయవాడ నందు తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు డిసెంబర్ 19 20 తేదీలలో నిర్వహించ బడతాయని అన్నారు.
తిరుపతి జోన్ కి సంబదించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వై.ఎస్.ఆర్ కడప, సత్యసాయి, అనంతపురము, నంద్యాల, కర్నూలు జిల్లాల కళాకారులకు మహతి కళాక్షేత్రం నందు నవంబర్19, 20, 21 తేదీలలో ఉదయం 10 గంటల నుండి పోటీలు నిర్వహించ బడుననీ తెలిపారు.
గుంటూరు జోన్ లోని ప్రకాశం పల్నాడు, బాపట్ల, గుంటూరు, యన్.టి.ఆర్ కృష్ణాజిల్లాల కళాకారులకు నవంబర్ 24, 25, 26 తేదీలలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు
రాజమండ్రి జోన్ లోని ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కళాకారులకు నవంబర్ 29,30 డిసెంబర్ 1 తేదీలలో శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం నందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు
విశాఖపట్నం జోన్ లోని అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కళాకారులకు డిసెంబర్ 7,8,9 తేదీలలో ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో జరుగుతాయని అన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 19, 20 తేదీలలో తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ నందు నిర్వహింపబడునని తెలిపారు.
సాంప్రదాయ నృత్యాలలో కూచిపూడి నృత్యం, ఆంధ్ర నాట్యం, భరతనాట్యం, గొత్రం (సింగింగ్) జానపద కళారూపాలు డప్పులు, గరగలు, తప్పటగుళ్ళు చెక్క భజన పులి వేషాలు, బుట్ట బొమ్మలు, కాళికా వేషాలు, ఉరుములు మరియు గిరిజన కళారూపాలైన ధింసా, కొమ్ముకోయ, సవర, లంబాడీ తదితర కళారంగాల్లో జోనల్ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించబడుననీ ప్రతి విభాగంలో జోనల్ స్థాయి విజేతలకు గ్రూపు కు రూ 25,000/- సోలోకి రూ. 10,000/- మరియు రాష్ట్ర స్థాయి విజేతలకు గ్రూపుకి లక్ష రూపాయలు, సోలోకి యాభై వేలు గౌ ముఖ్యమంత్రి జన్మదినాన అందచేయ నున్నట్లు తెలిపారు. ఆసక్తి గల కళాకారులు పాల్గొనాలంటే https://culture.ap.gov.in వెబ్సైటు నందు నమోదు చేసుకోవాలని, apculturalcompetitions@gmail.com ఈ -మెయిల్ నందు నవంబర్ 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలని కోరారు.
సాంస్కృతిక క్రీడా శాఖా మంత్రిగా వివిధ క్రీడాకారులకు పోటీలు నిర్వహించి జగనన్న పుట్టిన రోజున బహుమతులు అందచేసేవిధంగా పోటీలు నిర్వహించేందుకు యాభై లక్షలు కేటాయించి క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ పోటీలు జిల్లా జోనల్ రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామని గెలిచిన వారికి రాష్ట్ర స్థాయిలో మంచి బహుమతులు అందచేస్తామని అలాగే జగనన్న పుట్టిన రోజు వేడుకలలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈడి మరియు రీజినల్ డైరెక్టర్ పర్యాటక శాఖ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్ర నాథ్ రెడ్డి సెట్విన్ సీఈవో మురళి తదితరులు పాల్గొన్నారు