Breaking News

ఘనంగా ప్రారంభమైన 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

-ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రంథాలయాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, ప్రతి గ్రామ సచివాలయంలో గ్రంథాలయాలు ఏర్పాటుచేయాలని తమ ఆలోచనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ గ్రంథాలయ వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని, రాష్ట్రంలో డిజిటల్ గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలో మొదటిగా డిజిటల్ గ్రంథాలయాలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు. గ్రంథాలయాలకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. గ్రంథాలయ వ్యవస్థ పటిష్టతకు చర్యలు తీసుకున్నారని, అందులోభాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ కి చైర్మన్ గా మందపాటి శేషగిరిరావును నియమించడం తార్కణమని కొనియాడారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని మంత్రిగా హామీ ఇస్తున్నానని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గ్రంథాలయాల ప్రాధాన్యత ఎక్కువన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎందరో మహానుభావులు జైల్లో ఉండి కూడా పుస్తకాలు చదివారని, రాశారని ఇది చరిత్ర మనకు అందించిన వాస్తవమని తెలిపారు. మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే గొప్పవ్యవస్థనే గ్రంథాలయాలు అని కొనియాడారు. ప్రతి గ్రామ సచివాలయంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచన అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా.. గ్రంథాలయ వ్యవస్ధను సాంకేతిక అంశాలతో అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రభుత్వం గ్రంథాలయాలు అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించి గ్రంథాల యొక్క ప్రాధాన్యతను, గ్రంథ పఠనం యొక్క ఆవశ్యకతను తెలియజేయడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు తమవంతు సహకారాన్ని అందించాలన్నారు. బడ్జెట్ లో నిధులను ప్రభుత్వం కేటాయించి గ్రంథాలయాలను అభివృద్ధి చేయడంతో పాటుగా చారిత్రక, సాంస్కృతిక, అక్షరోద్యమాలకు నిలయమైన పురాతన గ్రంథాలను ప్రభుత్వం గుర్తించి వాటిని పరిరక్షించి వాటిని కంప్యూటరైజషన్ చేసి
భావితరాలకు అందిస్తున్నామన్నారు. వేదకాలం నాటి గ్రంథాలను గుర్తించి వాటిని కాపాడడానికి గాను మరియు వాటిని ప్రజలకు అందుబాటులోనికి తేవడానికి గాను ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. రాష్ట్రంలోని గ్రంథాలయాలను అప్ గ్రేడ్ చేసి గ్రంథాలయాల మనుగడను రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరం చేసిందని మంత్రి అన్నారు. ముందుగా సభా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘పుస్తక ప్రదర్శన’ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ.. సంస్కరణాభిలాషి, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థతో పాటు గ్రంథాలయ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలని, ప్రపంచానికి అందించాలనే లక్ష్యంతో టెక్నాలజీ అందించి డిజిటల్ గ్రంథాలయ వ్యవస్థను గ్రామస్థాయికి చేరువ చేశారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో 10వేల 960 గ్రామాల్లో డిజిటల్ గ్రంథాలయ వ్యవస్థ నిర్మాణం జరుగుతుందన్నారు. గతంలో గ్రంథాలయ వారోత్సవాలను జిల్లాల్లో నామమాత్రంగా వేడుకలు నిర్వహించేవారని, కానీ ఈ ప్రభుత్వంలో వారోత్సవాలను రాష్ట్రస్థాయిలో ఒక ప్రారంభ వేడుకలుగా నిర్వహించి పాఠకులు, ప్రజలందరి దృష్టి సారించేలా కృషిచేస్తున్నారు. గత ప్రభుత్వాలు గ్రంథాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని భావించాయని, గ్రంథాలయ సెస్ ను కూడా వేరే కార్యక్రమాలకు నిధులు మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1919లో అయ్యంకి వెంకటరమణయ్య ఆధర్వంలో నవంబర్ 14, 15 తేదీలల్లో గ్రంథాలయ వారోత్సవ కార్యక్రమానికి అంకురార్పణ జరిగిందన్నారు. గ్రంథాలయ వ్యవస్థ పరిఢవిల్లేందుకు అందరూ కృషి చేస్తున్నారన్నారు. గ్రంథాలయ వ్యవస్థను పటిష్టం కోసం రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ముందుగా గ్రంథాలయ ప్రతిజ్ఞను వేదికపై ఆశీనులైన మంత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు అందరిచేత చైర్మన్ మందపాటి శేషగిరి రావు చేయించారు.
ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ… ఏ ప్రాంతంలో అయితే ప్రజలందరూ గ్రంథాలయాలకు వెళ్లి వస్తుంటారో ఆ ప్రాంతమంతా విజ్ఞానంతో ప్రజ్వరిల్లుతుందన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో కూడా పత్రికలు, గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన గ్రంథాలయాలు ఉన్నాయన్నారు. గ్రంథాలయ ఉద్యమానికి విజయవాడ, కృష్ణా జిల్లా కేంద్రబిందువుగా ఉందన్నారు. విజయవాడలోని రామ్మోహన్ గ్రంథాలయానికి ఎంతో చరిత్ర ఉందని, రామ్మోహన్ గ్రంథాలయాన్ని ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని అధికారులకు, ప్రభుత్వానికి సభావేదిక సాక్షిగా మల్లాది విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్దం అయ్యేందుకు వీలుగా చరిత్ర, సమకాలీన అంశాల గురించి తెలుసుకోవడానికి గ్రంథాలయాలు ఎంతో దోహదం చేస్తున్నాయని మల్లాది విష్ణు తెలిపారు.
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. కేవలం పిల్లలు పుస్తకాలు చదవాలని చెబితే సరిపోదని, టీచింగ్ విధానం కూడా మారాలన్నారు. దీనికోసం నో అటెండెన్స్, ఒపెన్ బుక్ ఎగ్జామ్, సమకాలీన అంశాల వారీగా ప్రయారిటీ రిలేటెడ్ ఎగ్జామ్స్, పిల్లలు రాసింది క్లాస్ రూంలో చదివించడం వంటి 4 సంస్కరణలు తీసుకురావాలన్నారు.
ఎమ్మెల్సీ టి. కల్పలత మాట్లాడుతూ… ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గొప్ప వ్యక్తలను స్మరించుకుంటే, వారిలో కచ్చితంగా ‘పుస్తక పఠనం’ చేసిన వ్యక్తులు ఉంటారన్నారు. పుస్తకం అనేది మన జీవితంలో ఒక భాగం, ఆత్మబంధువు అన్నారు. కందుకూరి విరేశలింగం చెప్పినట్లుగా చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో మనే సూత్రాన్ని అందరూ పాటించాలన్నారు. ప్రపంచానికి దిశానిర్ధేశం చేసిది పుస్తకమని, పుస్తకం జీవితాన్నింస్తుందని ఆమె అన్నారు.
పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ మాట్లాడుతూ.. పిల్లలను పుస్తకాలకు ఎడిక్ట్ చేయండని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ, ‘నో టు డ్రగ్స్.. ఎస్ టు బుక్స్..’ (NO TO DRUGS.. YES TO BOOKS) అని ప్రభుత్వం తరపున ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి కేవలం చదువు, విజ్ఞానం మాత్రమే అన్నారు. మన విద్యా విధానంలో నిర్వచనం పైనే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, ప్రయోగ పద్దతిలో కూడా విద్యను మార్పు చేయాలన్నారు. ప్రతి విద్యార్థిని గ్లోబల్ స్టూడెంట్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మన విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చైల్డ్ సెంట్రిక్ సంస్కరణలు తీసుకురాలేదని, ఈ ప్రభుత్వమే చైల్డ్ సెంట్రిక్ గా సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ఇందులో భాగంగా ‘వీ లవ్ రీడింగ్’ (WE LOVE READING) అనే కాన్సెప్ట్ ని నవంబర్, 2020న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇలాంటి కాన్సెప్ట్ ని మన రాష్ట్రం కంటే రెండు సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చిందని తెలిపారు. గ్రంథాలు పెట్టుకునే ఆలయాలు గ్రంథాలయాలని, కానీ ఈ ఆలయాలకు ఎవరూ వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉంటే కేవలం 10 లక్షల మంది మాత్రమే గ్రంథాలయాల మెంబర్ షిప్ ఉందని, ఇది వచ్చే సంవత్సరం వారోత్సవాలకు కోటికి పెరగాలని ఆకాక్షించారు. గ్రంథాలయాల అభివృద్ధికి చైర్మన్, డైరెక్టర్ లు కృషిని రాజశేఖర్ అభినందనందించారు.
పాఠశాల విద్యాశాఖ కమీషనర్ యస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతీ పాఠశాలలో గ్రంథాలయం ఉండాలన్నారు. పుస్తకం చదవడం అనేది వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ప్రతీ రోజూ పిల్లలు అరగంట సేపు పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ తిప్పరపల్లి జమల పూర్ణమ్మ, పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ పుణ్యశీల, పౌర గంథాలయశాఖ డైరెక్టర్ డా. ఎం.ఆర్. ప్రసన్న కుమార్, ఎన్టీఆర్ జిల్లా డీఈవో రేణుక, డిప్యూటీ డీఈవో రవికుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *