– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-31వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలందరూ సంతోషంగా ఉండేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శుక్రవారం 31 వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ వీధులలో విస్తృతంగా పర్యటించి.. 294 గడపలను సందర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక, అవినీతిరహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఏపీలో అమలవుతున్న బృహత్తర కార్యక్రమాలు దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు కూడా ఎప్పుడూ ఇంతటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన చరిత్రలేదన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. రేషన్ వాహనం ప్రతి ఇంటికీ కచ్చితంగా వెళ్లాలని సిబ్బందికి సూచించారు. శ్రీనగర్ కాలనీ 3వ లైన్లో దెబ్బతిన్న రహదారిని పున:నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం ఊడల ఆదిలక్ష్మి, గ్రంథి కాళేశ్వరరావు అను వృద్ధులకు మంజూరైన కుల, ఆదాయ పత్రాలను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. వీరిరువురికి కొత్త పింఛన్లు అప్లై చేయవలసిందిగా సచివాలయ సిబ్బందికి సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
2019 ఎన్నికలే చంద్రబాబుకి చివరాఖరి అవకాశం
అధికారం లేకపోయే సరికి చంద్రబాబుకి పిచ్చిపట్టినట్లు ఉందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. 2019 ఎన్నికలే చంద్రబాబుకి చివరాఖరి అవకాశమని.. ఇక తెలుగుదేశం ఎప్పటికీ మరలా అధికారంలోకి రావడం జరగదని పేర్కొన్నారు. దీంతో ఫ్రస్టేషన్లో కూరుకుపోయిన బాబు.. ఊరూరా వెళ్లి ఏడుపే ఏడుపు కార్యక్రమాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతారని.. ముఖ్యమంత్రి పదవి కోసం పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి, సైకిల్ గుర్తును లాక్కున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో గోబెల్స్ ప్రచారానికి చంద్రబాబు సృష్టికర్త అని.. ఆయన మాట్లాడే మాటల్లో నూటికి నూరు శాతం అబద్ధాలు, అసత్యాలే ఉంటాయన్నారు. దేశంలో ఎక్కడో జరిగిన కుంభకోణాలను.. రాష్ట్రానికి ఆపాదిస్తూ ఈ ప్రాంత బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చేయలేని ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో సంస్కరణలను.. మూడున్నరేళ్లు కాలంలో సీఎం వైఎస్ జగన్ చేసి చూపడంతో ఈర్ష్యా, ద్వేషాలతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. పైగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ప్రజలకు ఏం చేశాడో చెప్పుకోలేక.. మరో అవకాశం అడుగుతున్నందుకు సిగ్గుపడాలన్నారు. అధికారంలో ఉన్నంతకాలం సింగపూర్, మలేషియా, జపాన్ పర్యటనలంటూ గాలిలోనే తిరిగారు తప్ప ఏనాడూ నేల మీద తిరిగి పేదల బాగోగులు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తలక్రిందలుగా తపస్సు చేసినా చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. 2024 ఎన్నికల్లో 175 స్థానాలలో వైఎస్సార్ సీపీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు బెజ్జం రవి, పట్టాభి రామరాజు, మానం వెంకటేశ్వరరావు, పెరుమాళ్ల జయకర్, కనపర్తి కొండా, సామంతపూడి గోవిందరాజు(చిన్నా), అంగిరేకుల విజయ్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.