రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఏ ఒక్క రైతు ఇబ్బందులకు గురి కాకుండా రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వీ సీ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తో కలిసి రబీ లో ధాన్యం సేకరణ , ఇండ్ల నిర్మాణాల్లో పురోగతి, పారదర్శకంగా ఓటర్ల జాబితా అంశాలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ డా. కే.మాధవిలత సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో రైతులు నుంచి ధాన్యం కొనుగోలు సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర ను అందించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అందుకు తగ్గట్టుగా రైతు భరోసా కేంద్రాలు పరిధిలో గల రైతుల ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలన్నారు. తేమ శాతం విషయంలో మార్గదర్శకాలు మేరకు కొనుగోలు చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారీని తిరిగి పంప కూడదన్నారు.
వరి మిషన్ కటింగ్ ద్వారా చేయటం కొంచెం తేమ శాతం ఉంటుందని, తేమ ఉన్నప్పటికీ రైతులు ధాన్యాన్ని తీసుకోమంటే, ఏ ఒక్కరినీ వెనుకకు పంపకుండా ధాన్యం సేకరించాలన్నారు. ఆర్బికే కేంద్రాల్లో రైతులకు కావలసిన గన్ని బ్యాగులను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. దాని కొనుగోలులో అధికారులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా లో ఇప్పటివరకు 82030 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 25626 మంది రైతుల నుండి రు.268 కోట్ల విలువ గల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తెలిపారు. జిల్లాకు కేటాయించిన పూర్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు మరింత నిబద్దతతో పని చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 306 లే అవుట్లలో 53,974 గృహాలు మంజూరు చేయగా, వాటిలో ఇప్పటివరకు 12,857 ఇళ్ళు పూర్తయయని, మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యాలు వేగవంతం, ఆదిశలో సచివాలయ సిబ్బందితో సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు. ప్రతివారం వందకు తగ్గుకుండా స్టేజ్ కన్వర్షన్ చేపట్టాలన్నారు. గతవారం 2025 టార్గెట్ కు గాను 1252 మాత్రమే స్టేజ్ కన్వర్షన్ జరిగిందని అలా కాకుండా వ్యక్తిగత శ్రద్ద తీసుకొని నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు.
ఓటర్ జాబితా సవరణ పై సమీక్షిస్తూ జిల్లాలోని తాసిల్దార్ లందరూ స్పెషల్ సమ్మరీ రివిజన్ పై వారి పరిధిలో గల పోలింగ్ కేంద్రాల అధికారులతో సమావేశం నిర్వహించి ఇంటింటికి తిరిగి డేటాను సేకరించాలన్నారు. ఇందులో వాలంటీర్లు యొక్క సేవలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించ వద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. స్వీప్ కార్యక్రమం లో భాగంగా జిల్లాలోని డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఓటు నమోదు చేసే దిశగా ప్రత్యేక నోడల్ అధికారి నియమించాలన్నారు. డిసెంబర్ రెండో వారంలో జిల్లా ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్ సమీక్ష ఉన్నందున వాటర్ లో జాబితా సవరణ ప్రక్రియను వేగవతం చేయాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జేసీ సిహెచ్.శ్రీధర్, డీఆర్ఓ జి. నరశింహులు, ఆర్డీవో ఏ.చైత్ర వర్షిణి, సీపీఓ కె.ప్రకాష్, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ డి. భాల శంకర్ డీపీవో పి. జగదాంబ, డిఎస్ఓ పి.ప్రసాదరావు, జిల్లా హౌసింగ్ అధికారి బి.తారాచంద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవ రావు, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్, డి ఎం సివిల్ సప్లై తనుజ తదితరులు పాల్గొన్నారు.