-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డిసెంబర్ 1 న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నందమూరి నగర్ నుంచి పైపుల రోడ్డు కూడలి వరకు విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఎయిడ్స్ పై అవగాహనా ర్యాలీలో విద్యార్ధినీ విద్యార్థులు పెద్దఎత్తున భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను అందరూ ఆదరించాలని.. వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని సూచించారు. వ్యాధి సోకిన వాళ్ళని సమాజంలో మనతో కలిసి జీవించేలా మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు హెచ్ఐవి సోకిందంటే ఆత్మహత్యలకు పాల్పడే రోజుల నుండి.. ప్రజలే స్వయంగా అవగాహన పెంచుకునే స్థాయికి చేరుకున్నామన్నారు. ప్రస్తుతం ఎయిడ్స్ కు ఎన్నో మందులు, పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని.. ప్రభుత్వ వైద్యాశాలల్లోని ఏటీఆర్ సెంటర్లలో ఈ వ్యాధికి సంబంధించిన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఈ వ్యాధి సోకిన వారికి ప్రభుత్వం రూ. 5 వేల పింఛన్ అందిస్తోందని.. రాని వారు తన దృష్టికి తీసుకువస్తే పింఛన్ వచ్చేలా చూస్తామని హామీనిచ్చారు. పేద ప్రజలందరికీ ఆరోగ్యం అనేది ఒక హక్కుగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం న్యూట్రిషన్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ సమరం, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి, యునైటెడ్ ఎన్జీవోస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు రాంబాబు, అరుణ మహిళా మండలి అధ్యక్షురాలు సీతారత్నం, నాయకులు అలంపూర్ విజయ్, అఫ్రోజ్, రామిరెడ్డి, బోరా బుజ్జి, సత్యనారాయణ, వై.ఆర్.జి.కె.రాములు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.