విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి బాలోత్సవం ఆధ్వర్యంలో శనివారం బాలోత్సవ భవన్‌లో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో అధ్యక్షులు ఎస్.పి.రామరాజు, ప్రధాన కార్యదర్శి ఆర్. కొండలరావు, ఆఫీస్ బేరర్స్ గుమ్మా సాంబశివరావు, వెన్నా వల్లభరావు, వి. సాంబిరెడ్డి, వై. సుబ్బారావు, జి. రవీంద్ర, కె. వెంకట్, యు.వి.రామరాజులు పాల్గొన్నారు. అమరావతి బాలోత్సవం 5వ పిల్లల పండగ 2023 జనవరి 29, 30, 31 తేదీలలో పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, విజయవాడ-1లో జరపాలని నిర్ణయించడం జరిగింది. కాలేజిలో నిర్వహించుకోవడానికి అనుమతి యిచ్చిన ఛైర్మన్ మల్లికార్జునరావుకి, కాలేజి పాలకవర్గానికి, ప్రిన్సిపాల్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. 2017లో ప్రారంభమైన అమరావతి బాలోత్సవం 4 పిల్లల పండగలు పూర్తి చేసుకున్నది. కరోనా సమయంలో ప్రత్యక్షంగా జరుపలేకపోయినా 2020, 2021 సంవత్సరాలలో ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహించింది. ఈ పోటీలలో 2500 మంది పాల్గొన్నారు. 2022 మార్చిలో పి.బి.సిద్ధార్ధ కాలేజిలో రెండు రోజులు జరిగిన 4వ పిల్లల పండగలో 133 స్కూల్సు నుండి 6249 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. కరోనాకి ముందు 2019లో పిఎస్‌సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజిలో జరిగిన 3వ పిల్లల పండగలో 207 స్కూల్సు నుంచి 9926 మంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం జరిగే 5వ పిల్లల పండగలో 250 స్కూల్సు నుండి 12 వేల మంది పిల్లలు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు.
అమరావతి బాలోత్సవం 5వ పిల్లల పండగలో సబ్ జూనియర్స్ (2,3,4 తరగతులు), జూనియర్స్ (5,6,7 తరగతులు), సీనియర్స్ 8,9,10 తరగతులు) విభాగాలుగా 42 అకడమిక్, 16 కల్చరల్ మొత్తం 58 అంశాలలో పోటీలు జరుగుతాయి. అకడమిక్‌లో చిత్రలేఖనం, కార్టూన్, వ్యాస రచన, తెలుగులో మాట్లాడటం, కథా విశ్లేషణ, కవితా రచన, కథా రచన, వక్తృత్వం, మెమొరి టెస్ట్, క్విజ్, స్పెల్ బి, బెస్ట్ ఫ్రం వేస్ట్, సైన్స్ ఎగ్జిబిషన్, వార్తా రచన, పద్యం భావం, మట్టితో బొమ్మలు, మ్యాప్, దినపత్రికా పఠనం, డిబేట్, అంతర్జాలంలో అన్వేషణ, కథ చెబుతాను ఊ కొడతారా అంశాలుంటాయి. కల్చరల్‌లో ఏకపాత్ర, విచిత్ర వేషం, దేశభక్తి అభ్యుదయ గీతాలాపన, జానపద గీతాలాపన, జానపద నృత్యం, క్లాసికల్ డాన్స్, లఘునాటిక, కోలాటం, ఫాన్సీ డ్రస్, రైమ్స్ (తెలుగు, ఇంగ్లీష్) అంశాలుంటాయన్నారు. విజయవాడ నగరం, మరియు చుట్టుప్రక్కల వున్న మున్సిపాలిటీలు, మండలాల నుండి విద్యార్ధినీ విద్యార్ధులు పోటీలలో పాల్గొనవచ్చును. ప్రభుత్వ, మున్సిపల్, ప్రవేటు, ఎయిడెడ్, కార్పొరేట్… అన్ని రకాల స్కూల్సు విద్యార్ధినీ విద్యార్ధులు ఈ పోటీలలో పాల్గొనవచ్చును. డిశెంబర్ 15 నుండి అన్ని స్కూల్సుకు 5వ పిల్లల పండగ బ్రోచర్స్, ఎంట్రీ ఫారమ్స్‌ను మా వలంటీర్స్ ద్వారా అందిస్తామన్నారు. అమరావతి బాలోత్సవం 5వ పిల్లల పండగ జయప్రదానికి సహకరించవలసిందిగా అన్ని వర్గాల వారిని కోరుతున్నామన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …