-హౌసింగ్ లే అవుట్, ధాన్యం కొనుగోలు కేంద్రం, మన బడి నాడు నేడు పనుల తనిఖీ
ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్క లబ్దిదారుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంటి నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం సత్యవాడ, చివటం గ్రామాల్లో పర్యటించి హౌసింగ్ లే అవుట్, ధాన్యం కొనుగోలు కేంద్రం, మన బడి నాడు నేడు పనుల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రతి ఒక్క లబ్దిదారుడు ప్రభుత్వం ఉచితంగా అందచేసిన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణం చేపట్టిన పలువురు లబ్దిదారులతో కలెక్టర్ సంభాషించారు. ఇళ్ళ స్థలాలు పొంది ఇంటి నిర్మాణం చేపట్టవలసిన వారితో మాట్లాడుతూ, ప్రభుత్వం అందచేసే ఆర్థిక చేయూత కు, ఇసుక, సిమెంట్, ఐరన్ వంటి ముడి సరుకులు లే అవుట్ వద్ద అందుబాటులో ఉంచామని, అధికారులే స్వయంగా వచ్చి సహకారం, ప్రోత్సాహం ఇస్తుంటే సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎటువంటి సంకోచం లేకుండా ఇళ్లను నిర్మించుకోవాలని , ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.
అదనంగా బ్యాంకు రుణం ఇవ్వడం జరుగుతుందని, ఎస్ హెచ్ జి మహిళా సభ్యులు ఈ అవకాశాన్ని వదులుకొవద్దని తెలిపారు. మీ తరువాత తరం వారికి సొంత ఇంటిని ఇవ్వగలిగే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా చివటం గ్రామంలో ఇద్దరు లబ్దిదారుల ఇంటి నిర్మాణ పనుల శంఖుస్థాపన కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు.
శ్రీ యిందుకూరి సుబ్బరాజు జెడ్పీ హై స్కూల్ లో జరుగుతున్న మన బడి నాడు నేడు పనులను కలెక్టర్ మాధవీలత పరిశీలించారు. స్కూల్ ఆవరణ లో చేపడుతున్న ఫ్లోరింగ్ పనులను కలెక్టర్ పరిశీలించి, తగిన సూచనలు చేశారు. ప్రస్తుతం స్కూల్స్ లో పెద్ద ఎత్తున నాడు నేడు కింద తొమ్మిది కంపోనెంట్స్ పనులు చేపట్టి ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మార్పు చేసి మౌలిక సదుపాయాల ను చేపడుతున్న దృష్ట్యా అత్యంత ప్రాధన్యతను ఇస్తూ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలన్నారు. ఆయా స్కూల్స్ విద్యార్ధుల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు పనుల తీరును పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాలని పేర్కొన్నారు.
సత్యవాడ ఆర్ బి కే ధాన్యం కొనుగోలు కేంద్రం, వ్యవసాయ సహాకార పరపతి సంఘం సందర్శన
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ నుంచి ధాన్యం కొనుగోలు విధానంలో నూతన మార్గదర్శకాలను అమలు చేస్తూ ఇకపై పూర్తిస్థాయిలో ఆన్లైన్ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కు నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ కె మాధువీలత తెలిపారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం వద్ద తేమ శాతం, నాణ్యత శాతం కోసం కొనుగోలు కేంద్రంలో విధులు నిర్వర్తించే సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో తేమ శాతం విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం అన్నారు. ధాన్యం సేకరణ సందర్భాల్లో తేమ శాతం నిర్ధారణ పరీక్షల ఫలితాలను అనుసరించి మిల్లర్ ధాన్యం కొనుగోలు చేయవలసి ఉంటుందని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి గొని సంచుల ఇబ్బందులు లేకుండా రొటేషన్ పద్దతిలో ధాన్యం సేకరించి మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు.
ఈ పర్యటన హౌసింగ్ డి హెచ్ ఓ బి. తారా చంద్, ఇతర మండల హౌసింగ్, వ్యవసాయ, విద్యా శాఖ, స్థానిక ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.