– పాఠశాల విద్య కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్ సురేష్ కుమార్
– ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ అంశంపై ఒక రోజు కార్యశాల
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు పేదరికం అంతం చేసి, 2030 నాటికి ప్రజలందరూ శాంతి, శ్రేయస్సును ఆస్వాదించడానికి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నాయని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ అన్నారు.
బుధవారం విజయవాడలోని పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్.డి.జి)’ అంశంపై ఆర్జేడీలు, డీఈవోలు, సమగ్ర శిక్షా ఏపీసీలు, ఏఎస్ఓలతో ఒక రోజు కార్యశాల జరిగింది.
ఈ కార్యశాలలో ఎస్.డి.జి -4 అయిన గుణాత్మక విద్య లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రం అవలంభిస్తున్న వివిధ విద్యా విప్లవాత్మక ప్రధాన కార్యక్రమాలైన జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, మన బడి: నాడు- నేడు, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశ సంస్కరణలు ఈ అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఎలా దోహదపడతాయో వివరించారు.
యూడైస్ ప్లస్ డేటాను నమోదులో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా నమోదు కార్యక్రమం చేపట్టాలని అన్నారు. వివిధ సూచికలలోని అంతరాలపై దృష్టి సారించి ఆ అంతరం వాస్తవమైందా లేదా సరైన గణాంకాలు నమోదు చేయకపోవడం వల్ల ఉత్పన్నమైనదా అనే విషయాన్ని పరిశీలించాలని, వాస్తవ అంతరం అయితే ఆ అంతరాన్ని రూపు మాపడానికి ప్రణాళికలు, వివిధ విభాగాల సమన్వయంతో పరిష్కరణ దిశగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
ముఖ్యంగా 1నుండి 8 తరగతుల విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 11, 12 తరగతుల్లో స్థూల నమోదు నిష్పత్తి పాఠశాలల్లో విద్యుత్, తాగునీటి సదుపాయాలు, బాలికలకు ఉఫయోగంలో ఉన్న మరుగుదొడ్ల సౌకర్యాల కల్పన వంటి వాటిపై ముఖ్యంగా దృష్టి సారించాలని, తద్వారా మెరుగైన సుస్థిర అభివృద్ధి సూచికలు సాధించాలని ఆకాంక్షించారు.
పాఠశాలలను సందర్శించి వాస్తవ పరిస్థితులను వివిధ నివేదికల్లో సమర్పించాలని అన్ని జిల్లాల అధికారులను కోరారు. ఈ విషయంలో అపోహలతో కాకుండా వాస్తవ విషయాలపై దృష్టి సారిస్తూ సరైన సమాచారంతోనే అభివృద్ధి సూచీ సాధన దిశగా ప్రణాళికలు రచించాలని కోరారు. ఈ అంశాలపై వివిధ జిల్లాల పనితీరును విశ్లేషించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయ ప్రణాళిక విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ సీతాపతి గారు మాట్లాడుతూ.. విద్య, పేదరికం, మహిళా సాధికారిత తదితర అంశాల్లో అన్ని దేశాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఎస్.డీ.జి ప్రవేశపెట్టారని తెలిపారు.
అనంతరం సమగ్ర శిక్షా అదనపు రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యపై దృష్టి పెడుతున్నారు దీంతో పాటు ఎస్.డీ.జీ లక్ష్యాలకు అనుగుణంగా కుటుంబ, సామాజిక, ఆర్థిక నేపథ్యాలు కారణంగా చదువులో ఎవరూ వెనకబడకుండా పిల్లలు బడిలో ఉండేలా చొరవ తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో పాఠశాల విద్య (ఇన్ఫ్రా) కమీషనర్ కాటమనేని భాస్కర్, మధ్యాహ్న భోజన పథక సంచాలకులు డా. నిధి మీన, పాఠశాల విద్య డైరెక్టర్ పి.పార్వతి, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య , అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్, ప్రభుత్వ గ్రంథాలయాల సంచాలకులు ఎం.ఆర్.ప్రసన్న కుమార్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి, సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి, పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి , ప్రభుత్వ పుస్తక ప్రచురణల విభాగం సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ (సర్వీసులు) మువ్వా రామలింగం గారు తదితరులు పాల్గొన్నారు.