Breaking News

ఇంధన పరిరక్షణలో.. సరిలేరు ఏపీకి ఎవ్వరూ!

-రాష్ట్రానికి ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’
-రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఇంధన శాఖ అధికారులు
-రెండో గ్రూపు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానం
-జాతీయ స్థాయి ర్యాంకింగ్స్ లో రెండో స్థానం
-ఇంధన సామర్ధ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు
-పరిశ్రమలు, భవన నిర్మాణం వంటి కీలక రంగాల్లో ఇంధన సామర్ధ్య అమలుకు మరింత ప్రోత్సాహం
-ఏపీఎస్ఈసీఎంకు బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే అభినందనలు
-ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి సహకారం వల్లే రాష్ట్రానికి అవార్డు
-ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్
-సంపూర్ణ సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వం, బీఈఈకి కృతఙ్ఞతలు
-ఏపీఎస్ఈసిఎం సీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి

ఢిల్లీ/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంధన పొదుపు, సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. ఇంధన సామర్థ్యం, పరిరక్షణ అంశాల్లో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రం గుర్తించింది. రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను అందజేసింది. ఇంధన వినియోగం ఆధారంగా దేశంలోని రాష్ట్రాలను నాలుగు గ్రూపులుగా విభజించగా.. రెండో గ్రూపులో ఉన్న ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. ఫ్రంట్ రన్నర్ గా నిలిచింది. మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. జాతీయ స్థాయి ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచింది. ‘ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం)’కు ఇది ఐదో జాతీయ పురస్కారం కావడం విశేషం.
కేంద్ర ప్రభుత్వం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిలు ఈ అవార్డును అందుకున్నారు. ఏపీఎస్ఈసీఎం స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్-2020 మదింపు జరిగినపుడు రాష్ట్రానికి 50.5 స్కోర్ వచ్చింది. మలి విడత 2022లో జరిగిన మదింపులో 77.5 స్కోర్ సాధించింది (53 శాతం మెరుగైంది). దీనివల్ల రాష్ట్రం జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డుకు ఎంపికైంది. ఇటీవల కాలంలో ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్యం మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల వల్ల జాతీయ స్థాయిలో రాష్ట్రం మెరుగైన స్కోర్ సాధించగలిగింది.
రాష్ట్రంలో ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్-2017 జీవో, పట్టణ, స్థానిక సంస్థల్లో భవన నిర్మాణ నిబంధనలలో చేసిన సవరణలు, భవన నిర్మాణ రంగంలో ఎకో-నివాస్ సంహిత అమలుకు తీసుకున్న చర్యలు, కోర్టు భవనాల్లో ఇంధన సామర్ధ్య చర్యలు వంటివి రాష్ట్రానికి అవార్డు రావడంలో దోహదపడ్డాయి. అలాగే ఎంఎస్ఎంఈల్లో అమలు చేసిన ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు, ఆర్టీసీ సహా వివిధ ప్రభుత్వ శాఖలకు ఎలక్ట్రిక్ వాహనాలు అందచేయడం, సాధారణ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు తీసుకున్న చర్యలు, పరిశ్రమలు, వ్యవసాయం, గ్రామీణ మంచినీటి సరఫరా, పాఠశాలలు, పంచాయతీలు, మునిసిపాలిటీలు తదితర శాఖల్లో చేపట్టిన వివిధ ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్కోర్ మెరుగుపడేందుకు దోహదపడ్డాయి.
భారీ పరిశ్రమలు అమలు చేస్తున్న పాట్ పథకం నిర్దేశిత లక్ష్యాలను సాధించడం వల్ల 0.818 ఎంటీఓఈ ఇంధనం ఆదా అయింది. ఇంధన పొదుపు కార్యక్రమాలే కాకుండా రైతులు, పంప్ టెక్నీషియన్లు, వివిధ వర్గాల ప్రజల్లో ఇంధన సామర్ధ్య, పరిరక్షణపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. ఇవన్నీ జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి.
రాష్ట్రం జాతీయ స్థాయి అవార్డు గెలుచుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ఏపీఎస్ఈసీఎంకు అభినందనలు తెలిపారు. ఇంధన పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న అత్యుత్తమ విధానాలను ఇతర రాష్ట్రాలూ అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంధన సామర్ధ్య రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని ఆయన పేర్కొన్నారు.
ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందించిన సహకారం, మార్గదర్శకత్వం వల్లే రాష్ట్రానికి జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు లభించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో వివిధ కీలక రంగాల్లో అమలు చేసిన ఇంధన సామర్ధ్య కార్యక్రమాల వల్ల రూ.3800 కోట్లు విలువైన 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేయగలిగామని తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ శాఖల్లో ఇంధన పరిరక్షణ విభాగాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయాన్నీ ఆయన గుర్తుచేశారు.
ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య రంగం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వం, బీఈఈకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యల కారణంగానే 2020లో 50.5 ఉన్న స్కోర్ కేవలం రెండేళ్లనే 77.5కు చేరుకుందన్నారు. ఈ కృషిని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని.. తద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇంధన సామర్ధ్య లక్ష్యాలను త్వరితగతిన చేరుకోవచ్చని తెలిపారు. ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు చేయడానికి సహకారం అందించిన పరిశ్రమలకు, డిస్కాములకు, భవన నిర్మాణం, రవాణా వంటి కీలక శాఖలకు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్కామ్ సీఎండీలు జే.పద్మ జనార్ధనరెడ్డి, కే.సంతోష రావు, ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *