-రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దండి
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుని ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పింగళి వెంకయ్య సమావేశ మందిరం నందు కమిటీ అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు డిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు.
సమావేశంలో కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నప్పటికి ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తున్న సంఘటనలు ఉత్పన్నం అవుతున్నయన్నారు. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు 1421 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 379 మంది ప్రాణాలను కోల్పోయారని మరో 1274 మంది క్షతగాత్రు లైయారన్నారు. రోడ్డు ప్రమాదాలు రాత్రి 6 గంటల నుండి 12 గంటల లోపు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. 500 ప్రమాదాలు నమోదైతే వీటిలో 474 ద్విచక్రవాహనాలు 351 కార్లు, జీపు, టాక్సీల వలన మరో 265 లారీలు, ట్రక్కులు 171 ఆటోలు కారణంగా సంభవిస్తున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. వీటిని నివారించేందుకు రవాణా పోలీస్ రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ రహదారులపై ఇప్పటివరకు 120 మంది మరణించారన్నారు. ప్రాణాంతకరమైన ప్రమాదాలలో ఎక్కువ శాతం భవానిపురం, ఇబ్రహీంపట్నం, కృష్ణలంక, పటమట, పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఆయా మరణాలపై జాయింట్ ఇన్‌స్పెక్షన్ జరిపి ప్రమాదాలకు రోడ్లు రద్దీ, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, అతి వేగం మద్య సేవించి వాహనాన్ని నడపడం రోడ్డు పై పశువుల సంచారం కారణాలను గుర్తించడం జరిగిందన్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు సూచించిన చర్యలను చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
గూడ్స్ వాహనాలలో ప్రయాణీకులను ఎక్కించడంపై 39 అతివేగానికి 4983 లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపినందుకు 2483 నాన్ రిఫ్లెక్టర్ పై 3546 హెల్మెట్ ధరించిన వారిపై 5474 సీటు బెల్ట్ ధరించని వారిపై 845 ఓవర్‌లోడ్ గూడ్స్ వాహనాలపై 3214 పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించే వారిపై 435 రాంగ్‌డైరెక్షన్‌లో వాహనాలను నడిపేవారిపై 506 కేసులను నమోదు చేసిన్నట్లు డిడిసి యం పురేంద్ర సమావేశం దృస్టికి తీసుకువచ్చారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలప్రకారం ప్రకాశం బ్యారేజ్ 5,6 కానాల వద్ద, గంపలగూడెం మండలం వినగడప గ్రామం వద్ద, తిరువూరు`విసన్నపేట రోడ్డు మల్లేల గ్రామం వద్ద ఆర్‌అండ్‌బి సహకారంతో విద్యుత్ సంకేతాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్‌అండ్‌బి, పోలీస్ రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే ప్రెటోలింగ్ కొరకు 25 వాహనాలను వినియోగిస్తున్నామని ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను రక్షించేందుకు 108 వాహనాలను సిద్దంగా ఉంచడం జరిగిందని అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం రవాణా శాఖ రూపొందించిన ‘‘రహదారి ప్రమాద బాధితులకు సహాయం చేయడం మన అందరి బాధ్యత’’ అనే వాల్‌పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ డిల్లీరావు విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించడం మరణాలను నివారించడం ఎంతోకీలకమని ప్రమాదాలు జరిగిన్నప్పుడు ఆ ప్రాంతంలో సంచరిస్తున్న వారు బాధితులకు సహాయం చేసి హాస్పిటల్‌కు తీసకువెళ్ళడానికి సంకోచిస్తారని అలాంటి వారి మెడికో లిగల్ కేసులలో భాగంగా పోలీసులు హాస్పిటల్ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని దీనిని నివారించేందుకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ప్రమాద బాదితులకు సహాయంగా విచ్చిన వ్యక్తిని ఇబ్బంది పెట్టకుడదని వారి గుర్తింపు కార్డుగాని, చిరునామ గాని అడిగి వేదించకుడదని పోలీసులు సాక్ష్యం కోసం బలవంతం చేయకుడదని చట్టం సూచిస్తుందన్నారు. ప్రమాద బాదితులకు సహాయం చేసిన వ్యక్తుల గౌరవ సూచకంగా 5000 రూపాయల వరకు పారితోషకం యోగ్యతా పత్రాన్ని మంజూరు చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు చట్టం కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు.
సమావేశంలో డిడిసి యం పురేంద్ర, డిసిపి శ్రీనివాసరావు, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, జిల్లా పంచాయతీ అధికారి జె. సునీత, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ ఆర్. శ్రీనివాసముర్తి, పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బి జాతీయ రహదారు స్వచ్చంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.