-పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్.సురేష్ కుమార్
-‘నేనూ బడికిపోతా’ మొబైల్ యాప్, పోర్టల్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాలలో చేరని విద్యార్థులను, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి రెగ్యులర్ పాఠశాలల్లో చేర్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ అన్నారు. గురువారం విజయవాడలోని సమగ్ర శిక్షా బడి బయట పిల్లల విభాగం, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యశాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు వారు వారి వయస్సుకు తగినట్లుగా, నేర్చుకునే సామర్థ్యాన్ని బట్టి తరగతిలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ పిల్లలను చేర్చుకోవడానికి సమగ్ర శిక్షా RSTCలు, NRSTCలు, సీజనల్ హాస్టళ్లను నిర్ణీత కాలానికి ప్రత్యేక శిక్షణలు అందించడం కోసం, సాధారణ పాఠశాలల్లో చేర్చుకోవడం కోసం నడుపుతోందని తెలిపారు. బడి బయట ఉన్న ఈ పిల్లలకు కనీస నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవసరమైన ప్రత్యేక శిక్షణ అవసరం అని అన్నారు. ఈ సందర్భంగా బడి బయట పిల్లల విభాగానికి సంబంధించి ‘నేనూ బడికిపోతా’ మొబైల్ యాప్, పోర్టల్‌ని ఆవిష్కరించారు. ఈ యాప్ యూనిసెఫ్ సాంకేతిక సహకారంతో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభివృద్ధి చేసిందన్నారు.
సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గ్రామ సచివాలయ సిబ్బంది ఎంతో కష్టపడి బడిబయట పిల్లల సర్వే చేశారు, ఆ పిల్లలను బడిలో చేర్పించడం మన అందరి బాధ్యత అని అన్నారు. కాబట్టి మీరు రాష్ట్రంలో సమన్వయంతో పనిచేస్తున్నట్లే జిల్లాలో, మండలాల్లో అలానే పనిచేసి బడి బయటి పిల్లలను బడిలో చేర్పించి చదువుకునేలా చూడాలని అన్నారు. ALSCO లు జిల్లాలకి వెళ్లిన తర్వాత ఈ ఆప్ ద్వారా వచ్చిన వివరాలను పరిశీలించి సచివాలయం సిబ్బందితో కలిసి బడి బయటి పిల్లలను బడిలో చేర్పించాలని కోరారు.
సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డాక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. బడి బయట ఉన్న పిల్లలందరినీ క్లస్టర్ స్థాయిలో గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం జరిగిందన్నారు. అన్ని శాఖల సహకారంతో ఈ పని జరగాలి.
యూనిసెఫ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ గణేష్ కుమార్ నిగమ్ (న్యూదిల్లీ) మాట్లాడుతూ.. UNICEF ద్వారా పిల్లలను గుర్తించడం, ట్రాక్ చేయడం, మెయిన్ స్ట్రీమింగ్, ట్రాకింగ్ కోసం స్కూల్ పిల్లల యాప్ మరియు పోర్టల్ నుండి దీనిని అభివృద్ధి చేసిందని చెప్పారు. ఈ యాప్‌లో సర్వేను నిర్వహణ, నవీకరించబడిన డేటా, డాష్‌బోర్డ్ వంటివి అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
పాఠశాల విద్యాశాఖ సమన్వయంతో గ్రామ వార్డు సచివాలయాల తరఫున బడి బయట పిల్లల సర్వే ద్వారా గుర్తించిన బడి బయట ఉన్న పిల్లలను చేర్పిస్తామని, అందుకు తమ శాఖ సహకారం అందిస్తుందని గ్రామ వార్డు సచివాలయాల అదనపు కమిషనర్ కైలాస గిరీశ్వర్ తెలిపారు.
అనంతరం రాష్ట్ర ఓఓఎస్సీ కో-ఆర్డినేటర్ ఎన్.కె.అన్నపూర్ణ ప్రసంగిస్తూ బడి మానేసిన పిల్లలను క్లస్టర్ స్థాయిలో సమన్వయంతో చేర్పించేందుకు ఓఓఎస్‌సీ విభాగం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యశాలలో పాఠశాల విద్యాశాఖ ఐటీ సెల్ సూపరిండెంట్ సుధాకర్, యూనిసెఫ్ కన్సల్టెంట్ టి. సుదర్శన్, ఓఎస్సీ కన్సల్టెంట్ పి.గీత, సమగ్ర శిక్ష నుండి ALS కోఆర్డినేటర్లు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు, OOSC, IE సిబ్బంది పాల్గొన్నారు.