-అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి..
-ఈ ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి రూ.97,724 కోట్ల రుణాలు..
-నూటికి 99.50 శాతం రికవరీతో చెల్లిస్తున్న డ్వాక్రా సంఘాలు..
-91 శాతం డ్వాక్రా సంఘాలు A & B గ్రేడ్ లలో ఉన్నాయి.
-సెర్ఫ్ సీఈవో ఎ.ఎమ్.డి. ఇంతియాజ్ వివరాలు వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళలను సుస్థిర, ఆర్థిక సాధికారత వైపు చేయి పట్టుకొని నడిపించడానికి వీలుగా వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నావడ్డీ లాంటి పథకాలను మహిళల కోసం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎ.ఎమ్.డి ఇంతియాజ్ తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారురాలికి అన్ని పథకాలను అందించడం జరుగుతుందన్నారు. పొరపాటున అర్హత ఉండి ఎవరైనా మిగిలిపోయినా, వారికి బై యాన్యువల్ కింద ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలలో పథకాల లబ్ధిని అందించడం జరుగుతుందని తెలిపారు. విజయవాడ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ భవన్ లో సెర్ప్ కార్యాలయములో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలు, వాటి పురోగతిని వివరించారు.
ఈ సందర్భంగా సెర్ప్ సీఈవో ఎ.ఎమ్.డి ఇంతియాజ్ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక స్వావలంభన, సాధికారత లక్ష్యంతో ఏర్పాటైన డ్వాక్రా సంఘాలు.. ఆ లక్ష్యాన్ని డ్వాక్రా మహిళలు పూర్తిగా సాధించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో దాదాపు 1 కోటి 14 లక్షల మంది మహిళలు సుమారు 11.12 లక్షల డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా కొనసాగుతున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం డ్వాక్రా సంఘాలు సుమారు రూ.20,000 కోట్ల నుండి రూ.30,000 వేల కోట్ల వరకు బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నాయని, 2019 నుంచి ఇప్పటివరకు డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి రూ.97,724 కోట్లను రుణాలుగా అందించామని తెలిపారు. డ్వాక్రా సంఘాల మహిళలు క్రమం తప్పకుండా తీసుకొన్న రుణాలను నూటికి 99.50 శాతం రికవరీతో చెల్లిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 91 శాతం డ్వాక్రా సంఘాలు A & B గ్రేడ్ లలో కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులతో మాట్లాడి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని సంఘాలకు ఇస్తున్న బ్యాంకు రుణాల వడ్డీలను 13.50% నుంచి 9.50% కు తగ్గించడం జరిగిందన్నారు. అలానే కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసి వడ్డీ రేట్లను తగ్గించమని అడగడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి గారి అభ్యర్థన మేరకు డ్వాక్రా సంఘాలు తీసుకొనే రుణాలలో 3 లక్షల రుణ పరిమితి వరకు 7% వడ్డీకే రుణాలు ఇచ్చేవిధంగా RBI నుంచి మార్గదర్శకాలను ఇప్పించడం జరిగిందన్నారు. డ్వాక్రా మహిళలను వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టుగా, వారి జీవనోపాధి మెరుగు పర్చుకొనే విధంగా.. ఇప్పటివరకు అమూల్, హిందూస్తాన్, యూనిలివర్, ఐ.టి.సి., ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, అలానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాసకేంద్రం, టేనేజర్, మహేంద్ర & ఖేతి వంటి బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకొని వారికి వ్యాపార మార్గాలు చూపించి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత వంటి పథకాలతో వారికి సుస్థిరమైన ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేసిందని ఆయన తెలిపారు.
‘వైఎస్సార్ ఆసరా’ పథకం కింద మూడో విడత ఆర్థికసాయం మొత్తం దాదాపు రూ.6,400 కోట్లు జనవరి, 2023 సంవత్సరంలో మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమచేస్తామని ఇంతియాజ్ తెలిపారు. ‘వైఎస్సార్ ఆసరా’ పథకం కింద 11.04.2019 తేదీ నాటికి యస్.యల్.బి.సి వారి తుది జాబితా ప్రకారం 7.97 లక్షల మహిళా సంఘాలలోని 78.76 లక్షల అక్కచెల్లెమ్మలకు ఉన్న అప్పును రూ. 25,517 కోట్లను నాలుగు విడతల్లో చెల్లించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు రెండు విడతలలో రూ.12,758.28 కోట్లను మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమచేయడం జరిగిందన్నారు. అలాగే ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకం కింద వడ్డీ భారం డ్వాక్రా మహిళల మీద పడకుండా రూ.3 లక్షల ఋణ పరిమితి వరకూ రాష్ట్ర ప్రభుత్వమే ఆ వడ్డీ భారం భరిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే దాదాపుగా రూ.3,615.29 కోట్ల వడ్డీ భారం భరించిందని ఆయన తెలిపారు. మహిళల సమగ్ర అభివృద్ధి, ఆర్థిక సాధికారతలో భాగంగా “వై.యస్.ఆర్ చేయూత” పథకం ద్వారా బి.సి., యస్.సి., యస్.టి, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు నాలుగు దఫాలలో రూ.75,000/- ఆర్ధిక సహాయం అందింస్తోందని తెలిపారు. ఇప్పటికే మూడు దఫాలలో సుమారు 26.39 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు రూ. 14,110.61 కోట్ల లబ్ధిని అందించామని తెలిపారు. వీటితోపాటు అదనపు ఆదాయం చేకూర్చేలా మెరుగైన జీవనోపాధులను అంది పుచ్చుకునే విధంగా అవకాశాలను కల్పించామని సెర్ప్ సీఈవో ఎ.ఎం.డీ. ఇంతియాజ్ తెలిపారు.