-హెచ్‌సీజీతో ఒప్పందం వల్ల ఎంతో మేలు
-సీఎం జగనన్న చిత్తశుద్ధి వల్లనే క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం
-పేదలకు పూర్తి అండగా ప్రభుత్వం
-దేశానికే ఆదర్శంగా ఏపీలోని క్యాన్సర్ వైద్య విధానం
-గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పూర్తి బలోపేతంగా క్యాన్సర్ వైద్యం
-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
-ప్రఖ్యాత హెచ్‌సీజీతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మన దేశంలోనే ప్రతిష్టాత్మక క్యాన్సర్ వైద్య సంస్థ హెల్త్ కేర్ గ్లోబల్ (హెచ్‌సీజీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఏపీ ప్రభుత్వం క్యాన్సర్ చికిత్సలో మరో మైలురాయి చేరుకోబోతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్ లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం హెచ్‌సీజీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ రోగానికి వైద్యం అందించడంలో మన దేశంలోనే హెల్త్ కేర్ గ్లోబల్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. హెచ్‌సీజీకి దేశంలో అతి పెద్ద నెట్ వర్క్ ఉందని చెప్పారు. అంతర్జాతీయ వైద్యులతో క్యాన్సర్‌కు చికిత్స అందజేస్తున్న సంస్థ హెచ్‌సీజీ అని, ఇలాంటి ఒక గొప్ప సంస్థ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో నర్సులకు శిక్షణ, తల, మెడ, నోటి క్యాన్సర్‌ను గుర్తించేందుకు జిల్లా ఆస్పత్రుల్లోని డెంటల్ డాక్టర్లు మొత్తానికి శిక్షణ ఇవ్వడం, న్యూట్రిషన్, యోగా అంశాలపై తర్ఫీదు, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రుల్లో ప్రతి నెలా 30 క్యాంపులు నిర్వహించడం, రాష్ట్ర స్థాయి ఆస్పత్రులకు నిరంతర సహకారం అందించడం… లాంటి అంశాలు ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయని వివరించారు.
క్యాన్సర్ చికిత్స కోసం రూ.1000 కోట్లు ఖర్చు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి క్యాన్సర్ రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని చెప్పారు. ప్రతి రోగికి అత్యాధునిక వైద్యం పూర్తి ఉచితంగా మన రాష్ట్రంలోనే అందేలా జగనన్న చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అందుకోసం కడప, కర్నూలు పట్టణాల్లో రాష్ట్ర స్థాయి క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో క్యాన్సర్ వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అందుకోసం రూ.120 కోట్లను జగనన్న ఖర్చు చేస్తున్నారని తెలిపారు. హోమీబాబాలాంటి ప్రఖ్యాత క్యాన్సర్ కేర్ ఆస్పత్రులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్క క్యాన్సర్ రోగానికి సంబంధించే 400కు పైగా ప్రొసీజర్లకు ఉచితంగా వైద్యం అందిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్క క్యాన్సర్ వైద్యానికే రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జిఎస్ నవీన్‌కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్ (నర్సింగ్ ) డాక్టర్ బి.వల్లీ , హెచ్ సిజి ప్రతినిధులు డాక్టర్ యిఎస్ విశాల్ రావు , డాక్టర్ రవికిరణ్ , డాక్టర్ అమర్ నాధ్ , డాక్టర్ విఎస్ ఎన్ రావు తదితరులు పాల్గొన్నారు.