-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
-రాజ్ భవన్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-కేక్ కట్ చేసి వేడుకలలో భాగస్వామి అయిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాంతి, కరుణ, సహనం, ప్రేమలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాజ్ భవన్ దర్బార్ హోలులో ఆదివారం రాత్రి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో క్రీస్తు బోధనలు ఆచరణీయమైనవన్నారు. తన జీవితమే మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశమని, తద్వారా మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారన్నారు. దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారన్నారు. యేసుక్రీస్తు మానవాళికి అందించిన సందేశాన్ని మనం మన జీవితంలో ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించమే నిజమైన సంతోషమన్నారు. శాంతి, స్వేచ్ఛ, ఆనందానికి ఏకైక మార్గం ప్రేమ మాత్రమేనని, ద్వేషాన్ని ప్రేమతో, కోపాన్ని దయతో భర్తీ చేసినప్పుడు జీవితంలో మరింత శాంతిని పొందగలుగుతారని గవర్నర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి వేడుకలలో భాగస్వామి అయ్యారు. క్రిస్మస్ గీతాన్ని ఆలపించగా, బిషప్ రాజారావు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ ను క్రిస్టియన్ మత పెద్దలు పాకలపాటి ప్రభాకర్, మట్టా జయకర్, ఎబినేజర్ తదితరులు ఘనంగా సన్మానించగా, వారికి గవర్నర్ మధర్ ధెరిస్సా మెమోంటోలను బహుకరించారు. కార్యక్రమంలో గవర్నర్ సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్, ఉప కార్యదర్శి నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.