లెనిన్‌ స్ఫూర్తితో సామ్రాజ్యవాద దోపిడిని ఎదుర్కోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచంలో జరుగుతున్న సామ్రాజ్యవాద దోపిడిని లెనిన్‌ స్ఫూర్తితో ఎదుర్కొవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. లెనిన్‌ 153వ జయంతి కార్యక్రమం కారల్‌మార్క్స్‌, ఎంగేల్స్‌, లెనిన్‌ మెమోరియల్‌ కమిటీ ఆధ్వర్యంలో బుడ్డిగ జమిందార్‌ అధ్యక్షతన విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో శనివారం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచంతో ఎన్ని మార్పులు జరిగినా ప్రపంచ చరిత్రలో తనకుంటూ ఒక విలువైన సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తి లెనిన్‌ అన్నారు. నేటికీ అక్టోబరు విప్లవం, లెనిన్‌ మహాశయుని ఖ్యాతి ఏమాత్రం తగ్గలేదన్నారు. అక్టోబరు విప్లవం ద్వారా సోవియెట్‌ రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిరదన్నారు. మార్క్స్‌, ఏంగేల్స్‌, లెనిన్‌లు ఉన్న కాలంలో కంటే ఇప్పుడు ప్రజల మధ్య తారతమ్యాలు ఎక్కువైయ్యాయని చెప్పారు. పేద, ధనిక వర్గాల మధ్య తేడా పెరిగిందన్నారు. దోపిడి నూతన పంథాలో జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు కొత్త ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త పద్ధతుల్లో మార్క్సిజం, లెనినిజం భారతదేశంలో అన్వయించటానికి వామపక్ష మేధావులు ఆలోచించాలని కోరారు. భారతదేశంలో మతత్వవాదులు, కార్పోరేట్లు కలిసి ప్రయాణిస్తూ పెద్ద ఎత్తున దోపిడి కొనసాగిస్తున్నారన్నారు. ప్రజల మధ్య, కష్టజీవుల మధ్య చీలికలు తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి తరుణంలో మనందరం కమ్యూనిస్టులుగా ఏకమై ఈ దోపిడి వ్యవస్థకి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో విప్లవోద్యమ నిర్మాణానికి చాలా సమయం పట్టవచ్చు అయినా లెనిన్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్క్సిజం ఒక శాస్త్రం అన్నారు. రాజనీతి శాస్త్రాన్ని, ఎత్తుగడల పంథాతో బలమైన విప్లవాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి లెనిన్‌ అన్నారు. సామ్రాజవాద దేశాల మధ్య నలిగిపోతున్న దేశాలను సంఘటితం చేసి కార్మిక వర్గానికి మార్గదర్శకంగా నిలిచారని చెప్పారు. సాహితీవేత్త దివికుమార్‌ మాట్లాడుతూ లెనినిజాన్ని సిద్ధాంత రూపంలో చెప్పి వ్యక్తి స్టాలిన్‌ అన్నారు. ప్రపంచం సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా వచ్చిందే కార్మిక విప్లవం అన్నారు. సామ్రాజ్యవాదులకు భారతదేశం పెద్ద మార్కెట్‌గా ఉందన్నారు. అమెరికా లాంటి సింహాన్ని వ్యతిరేకించటానికి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ లెనిన్‌ రాసిన ‘ది స్టేట్‌ అండ్‌ రివల్యూషన్‌’,‘ ఇంపీరియలిజం’, ‘వాట్‌ ఈజ్‌ టూ బి డన్‌’ వంటి పుస్తకాలు ఆలోచింపజేస్తున్నాయని చెప్పారు. సీపీఎం రాష్ట్ర నాయకులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ సోషలిస్టు రాజ్యంలో మహిళలకు ఆర్థిక, సామాజిక సమానత్వం తీసుకువచ్చిన మహనీయుడు లెనిన్‌ అని కొనియాడారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు ఎం.రామకృష్ణ మాట్లాడుతూ ఈ దోపిడి వ్యవస్థ నుంచి మానవాళిని విముక్తి చేయటానికి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా లెనిన్‌ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్య మండలి అధ్యక్షులు చంద్రానాయక్‌, కోశాధికారి ఆర్‌.పిచ్చయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.అనిల్‌ అభ్యుదయ గీతాలు ఆలపించారు. సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకులు రావుల వెంకయ్య, అక్కినేని వనజ, రాష్ట్ర నాయకులు వై.చెంచయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంధ్రనాద్‌, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకట సుబ్బయ్య, సీపీఎం నాయకులు బి.తులసీదాస్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ నరసింహారావు, డాక్టర్‌ రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు మేధావులు, వామపక్ష పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరై లెనిన్‌కు ఘనంగా నివాళులర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *