ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి…

-సమాజంలో అత్యున్నత స్థానానికి చేరుకోండి…
-విద్యారంగం పై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు భవిష్యత్తు సమాజానికి శుభ పరిణామం…
-చదువుతోనే సమాజంలో గుర్తింపు…
-951 పాఠశాలల్లోని 1,15,674 మంది విద్యార్థులకు 23 కోట్ల రూపాయలు లబ్ది.
-జగనన్న విద్యా కానుక పంపిణీ సభలో జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్లగలిగే ఏకైక మార్గం విద్య అని జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు అన్నారు. భవిష్యత్తు సమాజాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై నేడు ఖర్చు చేస్తున్న నిధులు, పథకాలు, సౌకర్యాలు, అవకాశాలను విద్యార్థి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు.
నగరంలోని మధ్య నియోజకవర్గం లోని సత్యనారాయణపురం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో సోమవారం మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు అందజేశారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తోందన్నారు. నాడు నేడు పేరుతో పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన, అదనపు తరగతి గదుల నిర్మాణం, బాలికల కోసం ప్రత్యేక వసతుల కల్పన, సురక్షిత మంచినీరు వంటి వాటికి నిధులు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం పెడుతున్న ఈ ఖర్చు వెంటనే ఫలితాలు ఇవ్వదని గుర్తు చేశారు. ఇప్పుడు పెడుతున్న ఈ పెట్టుబడి భవిష్యత్తులో వైజ్ఞానిక సమాజానికి మార్గం వేస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా 951 పాఠశాలల్లోని 1,15,674 మంది విద్యార్థులకు 23 కోట్ల రూపాయలు పైగా ఖర్చుతో జగనన్న విద్యా కానుక కిట్లను పాఠశాల తెరిచిన రోజునే విద్యార్థులకు అందిస్తున్నామన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మాత్రమే కాకుండా విద్యార్థిని విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం పుష్టికరమైన ఆహారాన్ని కూడా అందిస్తున్నామని తెలిపారు. నిరంతరం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో జిల్లాలోని అన్ని పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలోని ఇతర పాఠశాలల కంటే ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్రస్థాయి లో గుర్తింపు పొందారన్నారు. గతంలో 500 మార్కులు వస్తే చాలా గొప్పగా ఫీలయ్యే వారని, కానీ ప్రస్తుత విద్యార్థులు చాలా బాగా చదవడం వల్ల 590 పైచిలుకు మార్కులు కూడా ఈ పాఠశాల విద్యార్థులు సాధించారన్నారు. ఇటువంటి ఫలితాలు సాధిస్తున్న ఈ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో పథకాలు ఉన్నప్పటికీ బాల బాలికల పురోభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలు మాత్రం మన రాష్ట్ర రూపురేఖలు మారుస్తాయని అన్నారు. విజయవాడ అర్బన్ మండలంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 12,840 మంది విద్యార్థినీ, విద్యార్థులకు నేడు జగనన్న విద్యా కానుక ఇట్లు అందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకుగాను మూడు కోట్ల 33 లక్షల 84 వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. 2,600 విలువ కలిగిన ఒక్కొక్క కిట్టులో ఒక స్కూల్ బ్యాగు, మూడు జతల యూనిఫామ్ బట్టలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్యపుస్తకాలు, ద్విభాషా నిఘంటువు, రాత పుస్తకాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం నుంచి మీకు అందిన ఈ బహుమతిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు.
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికీ చాలామంది తల్లిదండ్రులు ఈ పాఠశాలలో అడ్మిషన్ కోసం రికమండ్ చేయాలని తన వద్దకు వస్తుంటారన్నారు. ఈ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం హెచ్చు స్థాయిలో ఉండడమే కారణమన్నారు. రానున్న రోజుల్లో ఇదే పాఠశాల ప్రాంగణంలో ఒక జూనియర్ కళాశాలను కూడా ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ పాఠశాల పరిసర ప్రాంతాలలో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలేనన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ కోసం పెట్టిన ఖర్చు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఖర్చును గమనించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని ప్రధానోపాధ్యాయులు చెప్పిన సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. నాడు నేడు పథకంలో భాగంగా పది తరగతి గదులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి ఏమేం కావాలో తనకు ఎప్పుడైనా చెప్పవచ్చని అన్నారు. పాఠశాల విద్యా కమిటీ కూడా క్రియాశీలకంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి అత్యధిక మార్కులు సాధించిన వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో నగదు పురస్కారం అందజేయనున్నట్లు చెప్పారు. విజయవాడ మధ్య నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో 78 అదనపు తరగతి గదులు త్వరలో పూర్తి అవుతాయని పేర్కొన్నారు. విద్యార్థిని విద్యార్థులు కూడా హాజరు శాతాన్ని మెరుగుపరుచుకొని అమ్మ ఒడి పథకాన్ని అందుకోవాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో విద్యా రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇతర ఏ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదన్నారు. ఇటువంటి ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలలు త్వరలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతాయని, విద్యార్థినీ, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ ఆకాంక్షించారు.
. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సీవి రేణుక, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. మహేశ్వరావు , పశ్చిమ మండలం తహశీల్దార్ మాధురి , స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, పాఠశాల విద్య కమిటీ చైర్మన్ శ్రీధర్ శ్రీనివాస్ తదితరులతోపాటు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *