వృద్ధుల హక్కులను కాపాడండి…

-చట్టబద్ధమైన హక్కులను సద్వినియోగం చేసుకోండి…
-సమాజ పోకడల్లో మార్పులు విచారకరం..
-వృద్ధుల వసతి గృహాలపై పర్యవేక్షణ అవసరం..
-ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వృద్ధాప్యం కూడా మలిదశ బాల్యం వంటిదేనని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీ రావు అన్నారు.
ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా కలెక్టరేట్‌ కార్యాలయ ప్రాంగణం లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇటీవల కాలంలో వృద్ధుల పట్ల సమాజంలో వస్తున్న మార్పులు విచారకరమన్నారు. తమ సంతానం ఉన్నత స్థానం పొందేందుకు జీవితాలను ఫణంగా పెట్టి వారి పురోభివృద్ధి కోసం కృషిచేసిన తల్లిదండ్రుల పట్ల కొంతమంది వ్యవహరిస్తున్న తీరు విషాదకరమన్నారు. విదేశాలలో జీవితం గడుపుతున్న సంతానం తమ తల్లిదండ్రులను బాధ్యతా రాహిత్యంగా వదిలేస్తున్నారన్నారు. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు కూడా తమకున్న సంతానంలో అందరిని సమానంగా చూడకపోవడం కూడా ఈ తరహా ఘటనలకు కారణం కావచ్చునని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలలో కొందరు తల్లిదండ్రులు తాము కూడబెట్టిన ఆస్తుల పంపకం విషయంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా అందరికీ సమాన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ఇదే సమయంలో తమ సంతానం తమ పట్ల నిర్లక్ష్యం చూపితే తల్లిదండ్రులు సంతానానికి దాఖలుపరిచిన ఆస్తులను తిరిగి వెనక్కి తీసుకునేలా పంపిణీ సమయంలో న్యాయవాదుల సలహా మేరకు ఆస్తులు పంపిణీ చేయాలని సూచించారు. వృద్ధులపై జరుగుతున్న మానసిక, శారీరక దాడులు, వారితో దుష్ప్రవర్తన, తేలిక భావం ప్రదర్శించడం వంటి అంశాలలో వృద్ధులు చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. మనదేశంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించే పరిస్థితి లేని రోజు రావాలని ఆకాంక్షించారు. కొన్ని దేశాల్లో వృద్ధుల పట్ల సమాజంలో చాలా గౌరవం ఉంటుందన్నారు. జపాన్‌, నార్వే, స్వీడన్‌ వంటి దేశాలలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించటం లేదని తెలిపారు. ఆయా దేశాలలో వృద్ధుల పట్ల గౌరవభావం వ్యవహరించడంతోపాటు చట్టాలు కూడా చాలా బలంగా ఉంటాయన్నారు. అటువంటి పరిస్థితి మన దేశంలో కూడా రావాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్న సంతానం అక్కడి పరిస్థితులను గమనించాలన్నారు. ముఖ్యంగా అటువంటి ఆశ్రమాలలో నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు, వైద్య సేవలు, సిబ్బంది ప్రవర్తన, నిర్వాహకులు గత చరిత్ర వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఆయా ఆశ్రమాల పరిధిలోని పోలీసు శాఖ కూడా కచ్చితంగా పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. అలాగే అవాంఛనీయ పరిస్థితుల్లో తమ సంతానం వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను భరించలేని పరిస్థితుల్లో సంతానంపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చిన వారి సమస్యను సంబంధిత పోలీసు అధికారులు కూడా వృద్ధుల పట్ల గౌరవభావంతోనే వ్యవహరించాలని పేర్కొన్నారు. పోలీస్‌ కేసు అనంతరం ఈ కేసులను విచారించే ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు అమలు కాకపోతే చర్యలు తీసుకునే అధికారం ట్రిబ్యునల్‌ చైర్మన్‌ గా తనకు ఉందని గుర్తు చేశారు. ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు అనంతరం వృద్ధుల స్థితిగతులను గ్రామీణ ప్రాంతాలలో సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు. ఈ అంశంలో వృద్ధుల కోసం తాను ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటానని చెప్పారు. తీర్పు తర్వాత కూడా సంతానం వారి వారి తల్లిదండ్రుల పోషణ కోసం ఆర్థిక సహాయం తప్పనిసరిగా జమ చేసేందుకు గతంలో కలెక్టర్‌ గా వ్యవహరించిన ప్రవీణ్‌ చంద్‌ అనుసరించిన విధానం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. వృద్ధుల సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషించాలని చెప్పారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో మనదేశంలో మాత్రమే బలమైన కుటుంబ వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. కానీ ఇటీవల ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి కోసం సంతానం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, చిన్న కుటుంబం పేరుతో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపడం వంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం-2007 ప్రకారం వృద్ధులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులను ఆయన వివరించారు. వృద్ధుల ఇబ్బందుల పరిష్కారం కోసం విశాఖపట్నం కేంద్రంగా 14567 టోల్‌ ఫ్రీ నంబరు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ జీవిత అనుభవంతో జ్ఞానం పొందిన బుద్దులు వృద్ధులని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి రక్షణగా నిలుస్తున్న చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇటీవల తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో పొలం ఆస్తి విషయంలో ఎక్కువగా ఫిర్యాధులు నమోదు అవుతున్నాయన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ధస్తావేజులను కూడా రద్దు చేసే అధికారం ట్రిబ్యునల్‌కు ఉందని డిఆర్‌వో తెలిపారు.సబ్‌ కలెక్టర్‌ ఆదితి సింగ్‌ మాట్లాడుతూ తన స్వస్థలం ఢల్లీి అని, ఇటువంటి అవగాహన సదస్సులు తన స్వస్థలంలో చూడలేదని చెప్పారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్య భావం అనేది మన దేశ సంస్కృతిలో భాగం కాదన్నారు. ఐదు దశాబ్దాల క్రితం వృద్ధుల సంరక్షణ కోసం తమ సంతానం తీసుకున్న పరిస్థితులు నేడు లేకపోవడం బాధాకరమన్నారు. రాజ్యాంగబద్ధంగా వృద్ధులకు తమ సంరక్షణ కోసం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటీవల కొంతమంది వృద్ధులు తమ సంతానలోని కొందరి మాటలు నమ్మి తమ హక్కులను దుర్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితి రానివ్వకుండా వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వృద్ధాప్యమంటే జ్ఞానంతో కూడిన భాండాగారం వంటిదన్నారు. వృద్ధాప్యం అనేది మానవ జీవితంలో ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందేనన్నారు. ప్రధానంగా వృద్ధులను ఇబ్బంది పెట్టేవారు వృద్ధుల సంరక్షణ కోసం కఠిన చట్టాలు ఉన్నాయని దృష్టిలో పెట్టుకోవాలని సబ్‌ కలెక్టర్‌ అన్నారు.కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ, హెల్ప్‌ ఏజ్‌ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ వృద్ధుల హెల్ప్‌లైన్‌ అవగాహన పోస్టర్లను కలెక్టర్‌ డిల్లీరావు ఆవిష్కరించారు.కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి వి. కామరాజు, సీనియర్‌ సీటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు యం వెంకటేశ్వరరావు, సీనియర్‌ సీటిజన్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *