– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-1 వ డివిజన్ 238 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సమన్యాయమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 1 వ డివిజన్ 238 వ వార్డు సచివాలయ పరిధిలో శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత స్థానిక శ్రీ కోదండ రామాలయాన్ని సందర్శించిన ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం పడవల రేవు జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభించి కాలువ గట్టు వెంబడి కాలనీలలో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ పథకాలు శాచ్యురేషన్ పద్ధతిలో అర్హులకు సక్రమంగా అందుతున్నాయా లేదా..? అని ప్రజాభిప్రాయాలను సేకరించారు. ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించి, సంక్షేమ పథకాలను అమలు పరచడంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మల్లాది విష్ణు చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటికి యూజీడీ కనెక్షన్ తప్పనిసరిగా ఇవ్వవలసిందిగా వీఎంసీ అధికారులకు సూచించారు.
లబ్ధిదారుల హర్షాతీరేకాలు
గత తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అనే ఆలోచన చేస్తే.. జగనన్న ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూరుస్తోందని మల్లాది విష్ణు అన్నారు. సంక్షేమ పథకం అందని కుటుంబం సచివాలయ పరిధిలో ఒక్కటి కూడా లేకపోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తమ ఆనందాన్ని ప్రజాప్రతినిధులతో పంచుకున్నారు. తమ కుటుంబానికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆసరా, కాపునేస్తం, పింఛన్ కానుక, సున్నావడ్డీ (డ్వాక్రా) పథకాలు వర్తించినట్లు లబ్ధిదారు తోట లక్ష్మీ తాయారు తెలిపారు. గత మూడున్నరేళ్లలో అక్షరాలా రూ. 9 లక్షల 96 వేల 954 రూపాయల సంక్షేమం తమ కుటుంబానికి అందినట్లు మరో లబ్ధిదారు చల్లా వెంకటేశ్వరమ్మ చెప్పారు. అలాగే మరికొందరు లబ్ధిదారులు గతంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, ఈ ప్రభుత్వంలో పొందిన లబ్ధిని వివరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని చెప్పారు.
చంద్రబాబు చేసిన ద్రోహాన్ని బ్రాహ్మణ సామాజికవర్గం ఎన్నటికి మర్చిపోదు
తెలుగుదేశం హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసి.. పేద అర్చక, పురోహితుల గొంతు కోసిన గత పాలకులు మరలా ఏ ముఖం పెట్టుకుని సమావేశాలు నిర్వహిస్తారని మల్లాది విష్ణు ప్రశ్నించారు. తిరుపతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వంపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు హయాంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి అందించిన సంక్షేమంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఆనాడు పథకాల అమలులోనూ పెద్దఎత్తున కోతలు విధించి.. బ్రాహ్మణుల గొంతు కోశారని విమర్శించారు. కడుపు రగిలిన పేద బ్రాహ్మణుల ఉసురు తగిలే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాహ్మణుల మనోభావాలను కాపాడారని మల్లాది విష్ణు అన్నారు. అర్చకుల ప్రతి ఒక్క న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. చంద్రబాబు పాలనలో దేవాలయాల్లో కనీసం నైవేద్యం పెట్టే దిక్కులేక దాదాపు 20 వేల ఆలయాలు మూతపడే పరిస్థితి ఏర్పడింది నిజం కాదా..? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. అర్చకులకు వంశపారపర్యమైన హక్కులు కల్పించమంటే.. గొంతెమ్మ కోర్కెలు కోరవద్దని చంద్రబాబు అవమానించింది వాస్తవం కాదా..? నారా లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న తోడ్పాటుతో బ్రాహ్మణ సోదరులు ప్రగతిపథంలో ముందుకు దూసుకువెళుతున్నారని.. స్వతంత్ర భారతంలో ఎన్నడూ సాధించనంత అద్భుత ఫలితాలు సాధిస్తున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధి కోసం రూ. 70 కోట్ల నిధులు కేటాయించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని మల్లాది విష్ణు అన్నారు. కనుక బ్రాహ్మణ సామాజిక వర్గమంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉన్నారని.. 2024లో బ్రాహ్మణ ద్రోహి చంద్రబాబుకి మరోసారి గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, నాయకులు ఉద్ధంటి సురేష్, కొండా మహేశ్వర్ రెడ్డి, మానికొండ సాంబశివరావు, బండి వేణు, ఎల్.ఐ.సి. శివ, జక్క బాబు, తాతారావు, నాగరాజు, కొలకలేటి రమణి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.